సూరారంలో బిల్డింగ్‌ పైనుంచి పడి బాలుడు మృతి

మేడ్చల్ జిల్లాలోని సూరారంలో విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందాడు.

By Srikanth Gundamalla  Published on  7 Sept 2023 5:48 PM IST
boy died, building, suraram,

సూరారంలో బిల్డింగ్‌ పైనుంచి పడి బాలుడు మృతి

మేడ్చల్ జిల్లాలోని సూరారంలో విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఆడుకుంటున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాలుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

సూరారంలోని రాజీవ్ గృహకల్ప 29వ బ్లాక్ మూడవ అంతస్తులో కనకరత్నం అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి తులసినాథ్ అనే 13 ఏళ్ల కొడుకు ఉన్నాడు. బాలుడు ఆరో తరగతి చదువుతున్నారు. అయితే.. గురువారం స్కూల్‌కి హాలీడే కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు బాలుడు. ఖాళీగా ఉన్న బాలుడు ఇంటిపైకి వెళ్లి ఆడుకుంటున్నాడు. అనుకోకుండా కాలుజారి ప్రమాదవశాత్తు మూడో అంతస్తు పైనుంచి కింద పడిపోయాడు. దాంతో.. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

బాలుడి పల్స్‌ చూసిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కొడుకు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పైనుంచి పడి చనిపోయాడని తండ్రి సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Next Story