సమాజంలో గుర్తింపు కోసం తనపై తానే బీజేపీ నేత హత్యాయత్నం..చివరకు..
తెలంగాణలో ఓ వ్యక్తి తనపైతానే హత్యాయత్నం చేయించుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 4:15 PM GMTసమాజంలో గుర్తింపు కోసం తనపై తానే బీజేపీ నేత హత్యాయత్నం..చివరకు..
తెలంగాణలో ఓ వ్యక్తి తనపైతానే హత్యాయత్నం చేయించుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఇక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్వయంగా కంప్లైంట్ చేసిన వ్యక్తే ప్లాన్ చేసి మరీ తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నాడని తేలింది. దాంతో.. సదురు వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. రిటర్న్‌గా అతడిపైనే కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. కాగా.. ఆ వ్యక్తి బీజేపీలో నేతగా ఉండటం విశేషం.
హైదరాబాద్‌లో భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై కొందరు వ్యక్తులు హత్యా ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు. అయితే.. విచారణలో అతని అసలు బండారం బయటపడింది. ఈమేరకు మల్కాజిగిరి డీసీపీ పద్మజా ప్రెస్‌మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడని చెప్పారు. అతను సినీ నిర్మాతగాను, బీజేపీ హిందీ ప్రచార కమిటీలోనూ పని చేస్తున్నాడని చెప్పారు. అయితే.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు, పలుకుబడి రావాలని ఈ మర్డర్ ప్లాన్ తనపై తానే చేసుకున్నాడని డీసీపీ పద్మజా చెప్పారు. తనకు గన్‌మెన్లు ఉంటే సమాజం గౌరవిస్తుందని భావించి.. దురుద్దేశంతోనే ఈ ప్లాన్ చేసుకున్నాడని తెలిపారు. అయితే.. ఈ ప్లాన్‌ను ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్‌లో అమలు చేసి. ఆ తర్వాత ఫిర్యాదు చేశారని డీసీపీ చెప్పారు.
ఈ మొత్తం ప్లాన్ కోసం రూ.2.50 లక్షల ఒప్పందాన్ని నిందితుడు కుదుర్చుకున్నాడనీ డీసీపీ పద్మజా వెల్లడించారు. ఇక భాస్కర్ గౌడ్‌పై ఇతర పోలీస్ స్టేషన్‌లలో ఏడు కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. భాస్కర్ గౌడ్‌తో పాటు.. అతని ప్లాన్‌లో భాగం పంచుకున్న మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇన్నోవా కారు, రెండు బైకులు, రూ.2లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారనీ వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని మల్కాజిగిరి డీసీపీ పద్మజా చెప్పారు.