మూడ్రోజుల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అదృశ్యం
బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోన్న ఓ విద్యార్థి అదృశ్యం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 12:35 PM ISTమూడ్రోజుల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అదృశ్యం
బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోన్న ఓ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. గత మూడ్రోజులుగా విద్యార్థి కనిపించడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్ని బాసర ట్రిపుల్ ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి విద్యార్థి బన్ని తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి బన్ని ఫోన్ స్విచాఫ్ అయ్యింది. తల్లిదండ్రులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అదే రిపీట్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చిన బన్ని తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. యాజమాన్యాన్ని నిలదీసి అడిగారు.
గత గురువారం ఉదయం బన్ని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినట్లు యాజమాన్యం తెలిపింది. తమ అనుమతి లేకుండానే బన్ని బయటకు వెళ్లిపోయాడని వివరించింది. దీంతో.. అనుమతి లేకుండా విద్యార్థిని ఎందుకు బయటకు పంపారని ప్రశ్నించారు. యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను అన్నింటిని పరిశీలిస్తున్నారు. బన్నీ ఎక్కడికి వెళ్లాడు..? ఎందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు అనే కోణంలో తోటి స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. బన్ని ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.