కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 4:52 AM GMTకాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి
విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో థర్డ్ ఇయర్ చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో శనివారం విహార యాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి సరదాగా గడిపారు. ఆ తర్వాత చీకటి పడింది. దాంతో.. తిరుగుపయనం అయ్యారు. తిరుగు ప్రయాణంలోనే మృత్యువు వారిని కబలించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి దగ్గర ఉన్న ఓ కారు అదుపుతప్పి పాత, కొత్త వంతెనల మధ్య ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటే ఉన్న మరో కారులోని విద్యార్థులు వెంటనే క్షతగాత్రులను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విహారయాత్రకు వెళ్తున్నామని చెప్పి మృత్యువాత పడటంతో విద్యార్థుల కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేతికి అందిన కుమారులు అనంత లోకాలకు వెళ్లారంటూ రోదిస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు త్వరలోనే చెబుతామన్నారు పోలీసులు.