ఫ్లాట్‌లో ఎయిర్ హెస్టెస్ దారుణ హత్య.. స్వీపర్ పనేనా..?
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో ట్రెయినీ ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పదంగా మృతిచెందింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 4:16 PM ISTఫ్లాట్‌లో ఎయిర్ హెస్టెస్ దారుణ హత్య.. స్వీపర్ పనేనా..?
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో ట్రెయినీ ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పదంగా మృతిచెందింది. అంధేరీలోని తన ఫ్లాట్‌లోనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడి ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
చత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే (25) ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక అయ్యింది. దాంతో ఆమె ఏప్రిల్‌లోనే ముంబైకి వచ్చింది. అంధేరీలోని ఓ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్‌లో తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారు. కాగా.. కొద్దిరోజుల క్రితం వాళ్లిద్దరూ తమ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఫ్లాట్‌లో ఓగ్రే ఒక్కరే ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం రూపాల్ ఓగ్రే కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడేందుకు ఫోన్‌కాల్ చేశారు. కానీ.. ఆమె లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే రిపీట్ అయ్యింది. గతంలో ఎప్పుడూ ఇలా జరక్కపోవడంతో భయంతో ఆమె తల్లిదండ్రులు ఓగ్రే స్నేహితులకు కాల్ చేశారు. తమ కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఒకసారి వెళ్లి ఫ్లాట్ దగ్గర ఏం జరిగిందో చూడమని చెప్పారు. దాంతో.. ఆమె ఫ్రెండ్స్ ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా.. లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక ఫ్లాట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. డోర్‌ను పగలగొట్టి లోనికి వెళ్లారు. రూపాల్ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ.. లాభం లేకపోయింది. రూపాల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. ఈ కేసులో 40 ఏళ్ల వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న విక్రమ్ అత్వాల్ హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం రూపాల్ ఓగ్రే, విక్రమ్ అత్వాల్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అతడు రూపాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఫ్లాట్‌లో ఉండే మిగతా వారు కూడా అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆధారల కోసం హౌసింగ్ సొసైటీలోని కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అత్వాల్ భార్యను కూడా విచారిస్తున్నారు. అయితే.. రూపాల్ ఓగ్రే గొంతుపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా తెలపలేదన్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ముంబై పోలీసులు చెప్పారు.