ఆయనే నా హీరో: సీపీ అంజనీకుమార్
By సుభాష్
హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నగరమంతా జలదిగ్బంధంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరదనీరు వచ్చి చెరువులా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు నానా అవస్థలు పడ్డారు.ఇప్పటికే నగరంలో 30 మందికిపైగా మృతి చెందారు. వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఇంట్లోకి వరదనీరు చేరడంతో నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో వైపు తమ కుటుంబాలు వరద నీటి లో చిక్కుకున్నప్పటికీ పోలీసు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.
ఇక నగరంలో ప్రస్తుత పరిస్థితి గురించి అంజనీకుమార్ వెల్లడించారు. వరద సహాయక చర్యల కోసం ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరదనీరు ఉందని, కుల్సంపుర, కార్వాన్, తప్పచపుత్ర, అప్జల్‌గంజ్, మలక్‌పేట, చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
అలాగే చిక్కడ్‌పల్లి పోలీసు కానిస్టేబుల్ వీరేందర్ నా హీరో.. వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని కాపాడారు. అరవింద్ నగర్, దోమలగూడ వద్ద ఇది జరిగింది. ఇలాంటి ఆఫీసర్లే మా బృందంలో ఉన్న నిజమైన సార్లు. ఆయనకు సెల్యూట్ చేస్తున్నా. అలాగే హైదరాబాద్ పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ సీపీ అంజనీకుమార్ కానిస్టేబుల్ వీరేందర్‌పై ప్రశంసలు కురిపించారు.