ప్రపంచానికి ఎన్ని కోట్ల డోసులు కావాలి?

By సుభాష్  Published on  24 July 2020 5:34 AM GMT
ప్రపంచానికి ఎన్ని కోట్ల డోసులు కావాలి?

వణుకు తెప్పిస్తూ.. ఆగమాగం చేస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన మినహా మరో మార్గం కనిపించని పరిస్థితి. ఇప్పటికి ఈ మాయదారి మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. వ్యాక్సిన్ ను ఎంత త్వరగా తీసుకొస్తే మానవాళికి అంతమంచిదిగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కోసం ప్రయోగాల్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రయోగాలకు సంబంధించిన హ్యుమన్ ట్రయల్స్ ఫలితాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ తయారైతే.. ఏక కాలంలో ఎన్ని కోట్ల డోసులు కావాలి? ఎంతమేర ఉత్పత్తి చేయాలి? తొలుత ఎవరికి ఇవ్వాలి? లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వ్యాక్సిన్ ఖర్చు మాటేమిటి? అన్నది కూడా ప్రధానంగా మారింది. పలువురు నిపుణుల అంచనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన లెక్కలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే నాటికి వైరస్ ఇమ్యునిటీని సాధించే వారి సంఖ్య సుమారు 150 నుంచి 180 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఆరు వందల కోట్లలో ఎంతమందికి వ్యాక్సిన్ వెంటనే వేయాల్సి ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. ఒక అంచనా ప్రకారం వ్యాక్సిన్ వచ్చే నాటికి ప్రపంచ జనాభాలో కనీసం సగం మందికి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ లెక్కన చూసినప్పుడు 250 కోట్ల మందికి టీకాలు వేయాల్సి వస్తుంది. పెద్ద మయస్కుల కంటే కూడా మధ్య వయస్కులకు టీకాలు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయటంతో పాటు.. వారతా తిరిగి పనుల్లోకి వెళితే.. పరిస్థితి త్వరగా మెరుగుపడే వీలుందని చెబుతున్నారు.

ఖర్చు విషయానికి వస్తే.. ఎక్కువే అవతుందని చెబుతున్నారు. అయితే.. వ్యాక్సిన్ ను ప్రజలందరికి ఉచితంగా అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇదే బాటలోనే ప్రపంచ నాయకులు అడుగులు వేయాల్సి ఉంటుంది. మొత్తానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో? కానీ.. వచ్చినంతనే ఏం చేయాలన్న దానిపై మాత్రం పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. ఈ విషయంలో అమెరికాతో పాటు మరికొన్ని యూరప్ దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ఎలా ఉండాలన్న దానిపై పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నారు.

Next Story