కరోనా ఉందని తెలిసి కూడా బస్సుఎక్కారు.. ఆందోళనలో అధికారులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 3:31 AM GMT
కరోనా ఉందని తెలిసి కూడా బస్సుఎక్కారు.. ఆందోళనలో అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక బయటికి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. అయితే.. ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రం తమకు సోకిందని తెలిసీ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కరోనా లక్షణాలతో ఇటీవల నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు ముగ్గురు బాధితులు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వాళ్లకీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా వచ్చింది. అది తెలిసి వారు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సు(TS08Z 0229)లో ఎక్కారు. రాత్రి 10.30 గంటలకు బస్సు ఆదిలాబాద్‌ చేరుకుంది. దీంతో వారు బస్సు దిగి నేరుగా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి వెళ్లారు. తమకు కరోనా సోకిందని చెప్పి ఆస్పత్రిలో చేర్చుకోవాలని కోరారు. ఈఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆ బస్సులో ప్రయాణించిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

Next Story
Share it