కరోనా వైరస్‌: ప్రమాదంలో దేశాలు : డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

By సుభాష్  Published on  24 Oct 2020 8:00 AM GMT
కరోనా వైరస్‌: ప్రమాదంలో దేశాలు : డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్రంగా వ్యాపించే దిశలో అడుగులు వేస్తోంది. అయితే ప్రపంచంలో ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారి క్లిష్టమైన దశలో ఉందని, కొన్ని దేశాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెట్రోస్‌ అథనామ్‌ మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తారార్ధగోళంలో క్లిష్టమైన దశలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో కరోనాతో జనాలు నిండిపోయారని, ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని, రాబోయే కొద్ది నెలలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. కరోనా కారణంగా మరింత ప్రాణ నష్టం జరగకుండా మరిన్ని కరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే ఆరోగ్య సేవలు కూలిపోకుండా, విద్యాసంస్థలు మళ్లీ మూసివేయాల్సిందిగా ఆయా దేశాల నేతలను కోరారు.

మహమ్మారి కట్టడికి ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలో చెప్పానని, మరోసారి గుర్తు చేస్తున్నానని ఆయన అన్నారు. చాలా దేశాల్లో అంటు వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని, వైరస్‌ వ్యాప్తిని త్వరగా అరికట్టేందుకు ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి పాటిస్తే కరోనా నుంచి గట్టెక్కవచ్చని అన్నారు. అలాగే కోవిడ్‌ పరీక్షల పెరుగుదల, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ నిబంధనలను పాటించడం వల్ల ఆయా దేశాలు గట్టెక్కవచ్చని ఆయన సూచించారు.

Next Story