ఆ కుటుంబ సంతోషాన్ని విధి చూడలేకపోయింది

By సుభాష్  Published on  18 July 2020 3:59 AM GMT
ఆ కుటుంబ సంతోషాన్ని విధి చూడలేకపోయింది

ముఖ్యాంశాలు

  • వారం వ్యవధిలోనే ముగ్గురు మృతి

  • పుట్టెడు దుఃఖంలో నిండు గర్భిణి

ఎంతో ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబం సంతోషాన్ని విధి చూడలేకపోయింది. అందుకే వారి కుటుంబంలోకి కరోనా భూతాన్ని పంపించి ముగ్గురి ప్రాణాలను వారం వ్యవధిలోనే బలి తీసుకుని కడుపుతో ఉన్న ఆమెకు పుట్టెడు దుఃఖాన్ని బహుమతిగా ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..వరంగల్ లోని ఒక కార్యాలయంలో ఉద్యోగం చేసే యువతి అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది నెలలకు ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన భర్తతో పాటు అత్తమామలు కూడా చాలా సంతోషించారు. త్వరలోనే తమ చిన్ని రాజ్యంలోకి రాబోతున్న బుల్లి రారాజు కోసం వేచి చూస్తున్న తరుణంలో కరోనా భూతం వారి ఆనందాన్ని చిదిమేసింది. తీవ్ర జ్వరంతో పాటు ఇతర కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.

తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స తీసుకున్న అతడిని తర్వాత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే మామగారికి కరోనా సోకింది. ఆయనను ఎంజీఎంలో చేర్చగా చికిత్స పొందుతూ గత శుక్రవారం మృతి చెందారు. భర్త మృతిని తట్టుకోలేక అత్తగారు ఒక్కరోజులోనే కన్ను మూశారు. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న ఆమె భర్త కూడా జులై 16 గురువారం నాడు మృతి చెందాడు. ఇలా వారం వ్యవధిలోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వారసుడిని చూడకుండానే అందరూ వదిలి వెళ్లిపోయారంటూ ఆ యువతి పుట్టెడు దుఃఖంతో అల్లాడిపోతుంటే..అది చూసిన ఇరుగు పొరుగు వారు సైతం కంటతడి పెట్టుకున్నారు.

Next Story