మరోసారి షిప్‌లో ఉన్న భారతీయులకు కోవిడ్‌ పరీక్షలు..

By అంజి  Published on  22 Feb 2020 2:53 PM GMT
మరోసారి షిప్‌లో ఉన్న భారతీయులకు కోవిడ్‌ పరీక్షలు..

జపాన్: యొకొహామా పోర్టులో ఉన్న డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న భారతీయ ప్రయాణికులతో పాటు, ఇతరులకు మరోసారి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జపాన్‌లోని భారత రాయబార అధికార కార్యాలయం ట్వీట్‌ చేసింది. నౌకలో ఉన్న భారతీయులకు ప్రస్తుతం మరోసారి కోవిడ్‌ వైరస్‌ పరీక్షలు నిర్వహించనున్నారని, ఏ ఒక్కరూ కొవిడ్‌ లక్షణాలతో ఉండకూడదని ఆశిస్తున్నామని ట్విటర్‌లో పేర్కొంది. కాగా ఇప్పటికి 8 మంది భారతీయులకు కోవిడ్‌ వైరస్‌ సోకింది.

ప్రస్తుతం వారికి జపాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని.. కొత్తగా కేసులు ఏవీ నమోదు కాలేదని తెలిపింది. కోవిడ్‌ లక్షణాలు లేని కొందరు ప్రయాణికులను శుక్రవారం నాడు విడుదల చేశారు. ప్రస్తుతం సిబ్బందితో కలిపి దాదాపు 1000 మంది నౌకలో మిగిలిపోయారు. ఈ విషయాన్ని జపాన్‌ కేబినెట్‌ ముఖ్య కార్యదర్శి యేషిహిడే సుగా చెప్పారు. నౌకలో మొత్తం 138 మంది భారతీయులు ఉండడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం.



ఇదిలా ఉంటే.. చైనాలో కరోనా వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 2,345కు చేరింది. వైరస్‌ సొకిన వారి సంఖ్య 76,288కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్య కమిషన్‌ తన నివేదికలో తెలిపింది. ఇవాళ డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం వుహాన్‌లోని పరిస్థితిని పరిశీలించింది. అమెరికాలోనూ కోవిడ్‌ వైరస్‌ సోకిన వారి సంఖ్య 35కు చేరింది. దీంతో అమెరికాలోనూ క్రమక్రమంగా కోవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ కోరియాలో 346 మందిక కోవిడ్‌ వైరస్‌ సోకింది.

Next Story