వైద్యులనే కబళిస్తున్న 'కోవిడ్‌-19'

By అంజి  Published on  16 Feb 2020 10:24 AM GMT
వైద్యులనే కబళిస్తున్న కోవిడ్‌-19

చైనాలో కోవిడ్‌-19 వైరస్ పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఆరోగ్య పోరాటంలో అనారోగ్యం బారిన పడి అసువులు బాస్తున్నారు. ఒక వైపు కోవిడ్‌-19ను అరికట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే మరో వైపు అయిదు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 120 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. ఇదంతా గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిందే. చైనాలోనే ఇప్పటికి కోవిడ్‌-19 బారిన పడ్డ వారి సంఖ్య 63,851 కి చేరింది. ఇందులో 55,748 మంది చికిత్స పొందుతున్నారు. 1,380 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో 450 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి ముగ్గురు మృతి చెందారు.

హుబై రాష్ట్రంలోని వుహాన్ లో పెచ్చరిల్లిన ఈ వైరస్ ఇప్పుడు వివిధ దేశాలకు వ్యాపించింది. ప్రపంచంలో పలు దేశాల్లో ఈ వైరస్ వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే ఈ వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇక చైనా ప్రస్తుతం రెండు యుద్ధాలను చేస్తోంది. ఒకటి వ్యాధిని అరికట్టడం. దానిపై అదుపు సాధించడం. రెండవది కోవిడ్‌-19 వల్ల కుప్పకూలిన చైనా పరువు ప్రతిష్ఠలను మళ్లీ కాపాడుకోవడం. మళ్లీ ఇమేజీని బిల్డ్ చేసుకోవడం. నాలుగు వారాల పాటు ప్రయత్నాలు చేసిన తరువాత ఈ వారం ఎలాగోలా చైనా షేర్ మార్కెట్ కొద్దిగా కోలుకుంది. కాస్త ఊరటను ఇచ్చింది.

అయితే ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్సనందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, అదికారులు కూడా దీని బారిన పడుతున్నారు. చైనా ఆరోగ్య కమీషన్ ఉప మంత్రి జెంగ్ యిక్సిన్ కథనం ప్రకారం.. ఇప్పటి వరకూ 1716 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్‌-19 వైరస్ సోకింది. వీరిలో ఆరుగురు చనిపోయారు. “చైనా ఆరోగ్య కార్యకర్తలు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పనిచేస్తున్నారు. వారు నిరంతరాయం శ్రమిస్తున్నారు. వారికి విశ్రాంతి దొరకడం లేదు. వారిపై మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. వారిలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు.” అని యిక్సిన్ చెప్పారు.

చైనా చాలా కష్టపడి వైరస్ ను అదుపులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ పూర్తిగా విజయం సాధించలేకపోతోందని, చాలా ఆలస్యంగా స్పందించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారు చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఫలితం తక్కువగానే ఉందని వారంటున్నారు. చైనా రెండు రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలను వేగవంతం చేసింది. ప్రయోగాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఆ వ్యాక్సిన్లు బజార్లోకి రావడానికి కూడా సమయం పడుతుందని వారు చెబుతున్నారు.

మరో వైపు చైనీస్ న్యూఇయర్ సెలవుల తరువాత ప్రజలు నెమ్మదినెమ్మదిగా బీజింగ్ కు చేరుతున్నారు. వీరందరూ ముందు జాగ్రత్తగా పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. అలా చేయని వారిని శిక్షిస్తామని కూడా ప్రభుత్వం చెప్పినట్టు బీజింగ్ డెయిలీ ప్రకటించింది.

Next Story