దక్షిణ కొరియాలో పెరుగుతున్న కోవిడ్ - 19 కేసులు

By రాణి  Published on  22 Feb 2020 6:45 AM GMT
దక్షిణ కొరియాలో పెరుగుతున్న కోవిడ్ - 19 కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం చైనాలోని వుహాన్ నగరానికి చేరుకుంది. శుక్రవారం మరో 109 మంది మృతి చెందగా..ఇప్పటి వరకూ కోవిడ్ 19 బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2,345కు చేరుకుంది. కొత్తగా 397 కేసులు నమోదవ్వగా..వైరస్ సోకిన వారి సంఖ్య 76,288కి పెరిగినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. వైరస్ వుహాన్ నుంచి వ్యాపించినా..ఇప్పుడు ఈ వైరస్ బాధితులు హుబెయ్ ప్రావిన్స్ లో ఎక్కువగా ఉండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

కాగా..కోవిడ్ 19 పై దర్యాప్తు చేసేందుకు డబ్ల్యూహెచ్ ఓ 12 మంది నిపుణుల బృందం శనివారం వుహాన్ వెళ్లనుంది. ఇప్పటి వరకూ ఈ బృందం బీజింగ్, గాంగ్ డాంగ్, సిచువాన్ ప్రావిన్స్ లలో పర్యటించింది. ఇప్పుడు వైరస్ వ్యాప్తికి మూలకారణమైన వుహాన్, హుబెయ్ ప్రావిన్స్ లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి..వైరస్ ఎలా వ్యాపించిందో తెలుసుకోనుంది.

మరోవైపు కరోనా సోకి ఇటలీలో 78 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. 10 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతను శుక్రవారం మృతి చెందినట్లు ఆయన తెలిపారు..అమెరికాలో కూడా కోవిడ్ 19 బాధితుల సంఖ్య 35కు చేరింది. ఈ మధ్య కాలంలో జపాన్ లోని డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి సుమారు 300 మంది అమెరికన్లు తమ స్వదేశానికి వెళ్లారు. వారిలో కొంతమందికి వైరస్ ఉన్నట్లు తాజాగా నిర్థారణయింది. దక్షిణ కొరియాలో శనివారం నాటికి కోవిడ్ 19 బాధితుల సంఖ్య 142కు చేరింది. దీంతో ఆ దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 346కు పెరిగింది.

Next Story