భర్తతో విడిపోయినా.. కోడలికి అత్తారింటిలో ఉండే హక్కు ఉంది

By సుభాష్  Published on  17 Oct 2020 8:27 AM GMT
భర్తతో విడిపోయినా.. కోడలికి అత్తారింటిలో ఉండే హక్కు ఉంది

భర్త నుంచి విడిపోయిన మహిళలకు సంబంధించిన హక్కుల గురించి సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. విడాకులు తీసుకున్నా కూడా మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని దేశ అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఎవరి దారి వారు చూసుకుంటారు. ముఖ్యంగా మహిళలు విడిపోయిన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింటిలోనో లేదా వేరే చోటో ఉంటుంటారు. కానీ భర్తతో విడిపోయినంత మాత్రాన వారు ఇల్లు వదిలి వెళ్లిపోనక్కరలేదని.. వారు భర్త ఇంటిలోనే అంటే అత్తవారి ఇంటిలోనే ఉండవచ్చని అది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా సరే ఆ ఇంటిలో ఉండవచ్చని సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో తాజాగా తీర్పు ఇచ్చింది. 2019లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సవాలు చేస్తూ సతీష్‌ చందర్‌ అహుజా అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.

రవీన్‌ అహుజా అనే వ్యక్తి, ఆయన భార్య స్నేహ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనేపథ్యంలో స్నేహ కూడా తన అత్తవారింటిలోనే ఉంటోంది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తమ కోడలు ఇంట్లో ఉండరాదంటూ రవీన్‌ తండ్రి సతీష్‌ అహుజా కోర్టును ఆశ్రయించారు. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు సదరు మహిళ అత్తవారింట్లో ఉండేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది. కాగా.. ఈ తీర్పును సతీష్‌ చందర్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఆ ఇల్లు తన కష్టార్జితం అని.. ఆ ఇంటిలో తన కుమారుడికే హక్కు లేనప్పుడు కోడలికి ఎలా హక్కు వస్తుందని ఆయన ప్రశ్నించారు. కాగా.. ఈ వాదనను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. స్నేహ, రవీన్‌ల విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఆమె తన అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని.. రోజూ మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం పేర్కొంది. గృహ హింస చట్టం ప్రకారం మహిళలు భర్తతో కలిసి ఉండనప్పటికీ అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని న్యాయ స్థానం వివరించింది.

Next Story