అప్పుల్లో బ‌డా కార్పోరేట్ కంపెనీలు.. టాప్ 10లో మూడు తెలుగు వాళ్ల‌వే..!

By Newsmeter.Network  Published on  18 Dec 2019 1:34 PM GMT
అప్పుల్లో బ‌డా కార్పోరేట్ కంపెనీలు.. టాప్ 10లో మూడు తెలుగు వాళ్ల‌వే..!

ముఖ్యాంశాలు

  • కార్పొరేట్ అప్పుల కష్టాలపై క్రెడిట్ సూయిసీ రిపోర్ట్
  • పెరుగుతున్న అప్పులు - తరుగుతున్న సామర్ధ్యం
  • భారీస్థాయిలో పెరిగిపోతున్న కార్పొరేట్ ఋణాలు
  • వడ్డీరేట్లు ఎక్కువగా చెల్లించాల్సి రావడంతో నష్టాలు
  • ఆపరేటింగ్ లాభాల్లో ఎక్కువశాతం వడ్డీ చెల్లింపుకే
  • పదిలో నాలుగు కంపెనీల పరిస్థితి మరింత దారుణం
  • ఈ కంపెనీలను డి గ్రేడ్ లో చేర్చిన ఋణదాతలు

ముంబై : భారతీయ కార్పొరేట్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మొత్తంగా దేశంలో దిగ్గజాలైన టాప్ 10 కంపెనీలను తీసుకుంటే వాటిలో ఎక్కువశాతం కంపెనీలు క్యాపిటల్ వ్యయాన్ని బాగా తగ్గించుకుని ఆస్తుల్ని అమ్మడంద్వారా ఋణాలను తీర్చే ప్రయత్నం చేశాయి. క్రెడిట్ సూయిసీ గ్రూప్ ఎజి తాజా రిపోర్ట్ వెల్లడిచేసిన కార్పొరేట్ కంపెనీల ఋణబాధల తాజా స్థితిగతులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయనే చెప్పొచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

హౌస్ ఆఫ్ డెట్ పేరుతో 2012లో తొలిసారిగా విడుదలైన ఈ రిపోర్ట్ కార్పొరేట్ దిగ్గజాల ఋణబాధల వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ జాబితాలో పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇండియన్ కార్పొరేట్ కంపెనీలను వరసక్రమంలో చూపించిందీ రిపోర్ట్.

ల్యాంకో, జైపీ, జి.ఎమ్.ఆర్, వీడియోకాన్, జి.వి.కె, ఎస్సార్, అదానీ, రిలయెన్స్, జె.ఎస్.డబ్ల్యూ, వేదాంత గ్రూపులు పూర్తి స్థాయి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టుగా ఈ రిపోర్ట్ తెలిపింది.

కార్పొరేట్ కంపెనీల అప్పులు

గడచిన ఎనిమిది సంవత్సరాల్లో ఈ కార్పొరేట్ కంపెనీల అప్పులు ఎనిమిది రెట్లు పెరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా కట్టింది క్రెడిట్ సుయిసీ తెలిపింది. మొత్తంగా బ్యాంకింగ్ ఋణాల్లో ఈ కంపెనీల అప్పులు 12 శాతంగానూ, కార్పొరేట్ ఋణాల్లో 27 శాతంగానూ ఉన్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

వీటి ఇంట్రెస్ట్ కవర్ 2014-15లో 0.9 నుంచి 0.8కి తగ్గిందనీ అలాగే debt to Ebitda multiple (వడ్డీ, పన్నులు, డిప్రిసియేషన్, అమార్టిగేషన్ ల చెల్లింపుకంటే ముందు రాబడి) 6.8 నుంచి 7కు పెరిగిందనీ రిపోర్ట్ చెబుతోంది.

తీసుకున్న ఋణంపై చెల్లించే వడ్డీ రేటును,కాలాన్నిబట్టి నష్టభయం కొంత తగ్గే అవకాశం ఉండొచ్చు. పైన పేర్కొన్న రెండు అంశాలూ ఋణాల స్థాయినీ, ఋణాలవల్ల పెరిగే ఒత్తిడినీ, భారాన్నీకూడా నిర్దేశిస్తాయి.

debt to Ebitda multiple ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీపై ఋణభారం అంత ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అలాగే ఇంట్రస్ట్ కవరేజ్ రేషియో 1.5 లేదా అంతకంటే తక్కువగా ఉన్న కంపెనీ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఎక్స్ పెన్సెస్ ని భరించగలిగే స్థితిలో లేనట్టే లెక్క.

క్రెడిట్ సూయిసీ రిపోర్ట్

ఆర్థికమాంద్యం, ప్రభుత్వ అనుమతుల్లో మంజూరీకి ఆలస్యం, భూమిని సేకరించడం, ఇంధన సరఫరా లాంటి అంశాలు చాలా కంపెనీల నష్టభారాన్ని తీవ్రస్థాయిలో పెంచేశాయి.

ముఖ్యంగా రోడ్లు, పవర్ ప్లాంట్లు లాంటి కంపెనీలకు కార్పొరేట్ క్యాష్ ఫ్లో విపరీతంగా తగ్గిపోయి అసలు ఋణాలను తీర్చిగలిగే స్థాయిలో కూడా లేని స్థితికి దిగజారిపోతున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది.

ఈ పది కంపెనీల్లో కనీసం నాలుగు కంపెనీలకు అంటే జైపీ, ల్యాంకో, ఎస్సార్, జి.ఎమ్.ఆర్ కంపెనీలకు క్రెడిట్ సూయిసీ చెబుతున్న వివరాల ప్రకారం 40 నుంచి 65 శాతంవరకూ అప్పుల్ని తీర్చే స్థాయికూడా దిగజారిపోయిందనీ, ఋణాలను ఇచ్చిన సంస్థలు వీటిని డి గ్రేడ్ లో చేర్చాయనీ తెలుస్తోంది.

Next Story