కరోనా ఇకపై వరల్డ్ డిసీజ్ -WHO

By అంజి  Published on  12 March 2020 3:09 AM GMT
కరోనా ఇకపై వరల్డ్ డిసీజ్ -WHO

కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తోంది. దాదాపు వందకుపైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌ను ప్రపంచ వ్యాధిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ అలర్టయ్యాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. చైనాలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, ఇటలీ, ఇరాన్ తదితర దేశాల్లో తొలి మరణాలు సంభవించిన తరువాత కూడా... కరోనాను వరల్డ్ డిసీజ్ గా గుర్తించేందుకు నిరాకరించిన డబ్ల్యూహెచ్ఓ, ఇప్పుడు మనసు మార్చుకుంది. "కరోనా వైరస్ ఎంత శరవేగంగా విస్తరిస్తూ, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నదో పరిశీలించిన తరువాత, కొవిడ్-19ను మహమ్మారిగా గుర్తిస్తున్నాం" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధానోమ్ మీడియాకు వెల్లడించారు.

Coronavirus WHO emergency

మొత్తం 114 దేశాల్లో 1.18 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని టీడ్రాస్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ మహమ్మారేనని చెప్పడానికి ఇంతకన్నా మరే నిదర్శనాలూ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ మరో వ్యాధిని ఇంత తీవ్రంగా పరిగణించడం ఇదే తొలిసారి.

పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు..

WHO లెక్కల ప్రకారం.. కరోనా వైరస్ 110 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,291 మంది చనిపోయారు. మరో లక్షా 18వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా బయట కరోనా కేసులు కేవలం రెండు వారాల్లోనే 13 రెట్లు పెరిగాయి. దాదాపు 114 దేశాలకు కరోనా వ్యాధి వ్యాపించింది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,158 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది కోవిడ్-19. ఇటలీలో ఇప్పటి వరకు 631 మంది మరణించారు. ఇరాన్‌లో 291, దక్షిణ కొరియా 61, అమెరికాలో 31, ఫ్రాన్స్‌లో 33, స్పెయిన్లో 36, జపాన్‌లో 12, యూకే 6, నెదర్లాండ్స్ 4, ఆస్ట్రేలియా 3, హాంగ్‌కాంగ్ 3, స్విట్జర్లాండ్‌లో ఇద్దరు చనిపోయారు. భారత్‌లో 60 మందికిపైగా కరోనా బారినపడ్డారు.

Coronavirus WHO emergency

గత డిసెంబర్ లో చైనాలో తొలిసారిగా కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి, ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆర్థిక వృద్ధికీ విఘాతం కలిగించింది. వేలాది విమాన సర్వీసులు నిలిచిపోగా, ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడగా, పలు కీలక ఈవెంట్లు వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో టూరిస్ట్ వీసాలపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 15 వరకు ఉద్యోగులు, రాయబారుకు ఇచ్చే వీసాలు మినహా మిగిలిన అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story