విజృంభిస్తున్న కరోనా.. 80కి చేరిన మృతుల సంఖ్య

By అంజి  Published on  27 Jan 2020 7:28 AM GMT
విజృంభిస్తున్న కరోనా.. 80కి చేరిన మృతుల సంఖ్య

కరోనా..ప్రస్తుతం యావత్ ప్రపంచానికి వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి ఇది. ముఖ్యంగా చైనాలో దీని బారిన పడినవారి సంఖ్య అధికం. ఇప్పటి వరకూ చైనాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. ఇంకా 2,744 మందిలో ఈ ఆనవాళ్లున్నట్లుగా ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. అయితే కేలం కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల కోసమే చైనా 1000 బెడ్లతో ఒక ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

కేవలం 24 గంటల్లోనే 24 మంది మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీంతోపాటుగా 461 కొత్త కేసులు, 3,806 అనుమానిత కేసులు నమోదవ్వడంతో...చైనా అప్రమత్తమవుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 54 మంది కోలుకున్నట్లుగా వెల్లడించింది. ఇప్పటికే అక్కడున్న 13 నగరాల్లో ప్రజలెవ్వరూ బయట తిరగరాదంటూ ఆంక్షలు విధించింది. అలాగే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారికి కూడా ఆయా దేశాలు స్ర్కీనింగ్ టెస్ట్ లు చేస్తున్నాయి. ఎవరిలోనైనా ఈ వైరస్ ఉన్నట్లుగా అనుమానమొస్తే...వారిని అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారు. తొలుత వుహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ వైరస్ అంతటా విస్తరిస్తుండటం సర్వత్రా తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. హాంకాంగ్, తైవాన్, మకావుల్లో కూడా 17 మందిలో ఈ వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్లుగా సమాచారం.

థాయ్ లాండ్ లో ఏడుగురు, ఆస్ర్టేలియా, సింగపూర్లలో నలుగు, అమెరికాలో ముగ్గురు, జపాన్, ఫ్రాన్స్, మలేషియా దేశాల్లో ముగ్గురు, వియత్నాం, నేపాల్ దేశాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడినట్లుగా కేసులు నమోదైందని ఆయా దేశాల అధికారులు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కరోనా లక్షణాలున్నట్లుగా అనుమానం వచ్చిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ మహానరగంలో కూడా నలుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు సోకినట్లుగా డాక్టర్లు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులు ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నలుగురిలోని ఒకరి రక్త నమునాలను డాక్టర్లు పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు చైనా నుంచి ఇటీవలే వచ్చారు. వీరిని ఎయిర్‌పోర్టులో సిబ్బంది స్కానింగ్‌ చేసినప్పుడు వైరల్‌ లక్షణాలు ఏమీ డిటెక్ట్‌ అవ్వలేదు. తర్వాత జ్వరం, జలుబు రావండతో ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో వైద్య అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

Next Story