కరోనా అంటే కంగారు పడాల్సిందేనా?

By సుభాష్  Published on  1 March 2020 1:39 PM GMT
కరోనా అంటే కంగారు పడాల్సిందేనా?

ఇప్పటికి అరవైకి పైగా దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ దీనికి ప్రపంచాన్ని గడగడలాడించే మహమ్మారిగా హోదాను ప్రకటించలేదు. కానీ అన్ని దేశాలనూ ఈ వ్యాధితో పోరాడేందుకు సంసిద్ధంగ ఉండమని హెచ్చరించింది.. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ లిప్ స్టిచ్ రానున్న ఒక్క సంవత్సరంలో ప్రపంచ జనాభాలో 40 నుంచి 70 శాతం మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అయితే అన్ని కేసులూ ప్రాణాల మీదకు రావు. అసలు తమకు కరోనా వచ్చిందన్న సంగతికూడా చాలా మందికి తెలియకుండానే వచ్చి వెళ్తుంది.

ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 85406 కేసులు నమోదయ్యాయి. 2933 మంది చనిపోయారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం గతంలో వచ్చిన సార్స్, మెర్స్, ఎబోలా, లకన్నా కోవిడ్ 19 తక్కువ ప్రాణాంతకమైనదని భరోసా ఇస్తున్నారు. ఎబోలా వ్యాధి వచ్చిన వారిలో 40.4 శాతం మంది చనిపోయారు. మెర్స్ వచ్చిన వారిలో 34.4 శాతం మంది చనిపోయారు. సార్స్ వచ్చిన వారిలో 9.6 శాతం మంది చనిపోయారు. అదే కోవిడ్ వచ్చిన వారిలో మరణాలు 3.4 శాతమేనని వారంటున్నారు.

ఇది నిజానికి 1968 ఫ్లూ జ్వరం పదిలక్షల మందిని పొట్టన బెట్టుకుంది. అంతకు ముందు 1956 – 58 మధ్యలో వచ్చిన ఏషియన్ ఫ్లూ ఇరవై లక్షల మందిని చంపేసింది. దానికి ముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ ( 1918) అయిదు కోట్ల మంది ప్రాణాలను హరించింది. ఇటీవలి ఎయిడ్స్ 3.6 కోట్ల ప్రాణాలను హరించింది. కాబట్టి వీటితో పోలిస్తే కరోనా అంత ప్రమాదకరమైనదేమీ కాదంటున్నారు నిపుణులు. మీజిల్స్ వంటి వ్యాధి వ్యాపించిన దాని కన్నా కరోనా వ్యాప్తి నెమ్మదిగా జరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. అదే విధంగా యువకులకు ఈ వ్యాధి వల్ల పెద్దగా నష్టం ఉండదని, వృద్ధులు, బలహీనుల పైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు.

వీటికి తోడు కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ తయారీ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పరిశోధనలు వేగవంతమయ్యాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ కనుగొనే అవకాశాలున్నాయి. దీని వల్ల వ్యాధి వ్యాప్తి వేగం నెమ్మదిస్తుంది. కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

నిజానికి కరోనా అంటే కిరీటం అని అర్థం. కరోనా వైరస్ ను ఎలక్ట్రానిక్్ మైక్రో స్కోపులో చూస్తే వైరస్ పై కిరీటం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అనేకానేక కరోనా వైరస్ లు ఉన్నా, ఏడు రకాల వైరస్ లు మాత్రమే మానవులకు సోకుతాయి. మిగతావి జంతువులకు మాత్రమే సోకుతాయి. ఈ వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. కరోనా వైరస్ రైలు లేదా విమానంలో ప్రయాణించినప్పుడు వ్యాపించే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ముఖ్యంగా తుమ్ములు, తుమ్ముతున్నప్పుడు అడ్డంగా పెట్టుకున్న చేతిని సీటు కవర్లపై ఆనించడం వంటి వాటి వల్ల వ్యాపించే అవకాశం ఉందని, అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాప్తిని నిరోధించవచ్చునని నిపుణులు అంటున్నారు.

Next Story