ఆ కార్యక్రమానికి హాజరవ్వడమే కారణమా.. దక్షిణ కొరియాలో భారీగా ప్రబలిన కరోనా 

By సుభాష్  Published on  23 Feb 2020 3:45 PM GMT
ఆ కార్యక్రమానికి హాజరవ్వడమే కారణమా.. దక్షిణ కొరియాలో భారీగా ప్రబలిన కరోనా 

తమ దేశంలో కరోనా వైరస్(COVID-2019) బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయినట్లు దక్షిణ కొరియా తెలిపింది. తమ దేశంలో ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 433 అని అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక చర్చిలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో 1000 మందికి పైగా హాజరయ్యారు. హాజరైన వారిలో చాలా మందిలో 'ఫ్లూ' లక్షణాలు కనిపించాయి. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్లలో శనివారం ఉదయానే 142 కొత్త కేసులు నమోదవ్వగా.. 87 కొత్త కేసులు మధ్యాహ్నం నమోదయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో దక్షిణ కొరియాలో కరోనా వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 'మూడు' కు చేరింది.

ఆ కార్యక్రమానికి హాజరవ్వడమే వైరస్ వ్యాప్తికి కారణమా..?

కొత్తగా నమోదవుతున్న కేసులు అక్కడి యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతోంది. దక్షిణ కొరియా తూర్పున ఉన్న నగరం డేగు(DAEGU)లోని షిన్చియోంజి చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.

శాంసంగ్ కంపెనీని కూడా కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. 'గుమి' లోని శాంసంగ్ మొబైల్ తయారీ కేంద్రంలో ఓ ఉద్యోగికి పాజిటివ్ అని తేలింది. దీంతో సోమవారం ఉదయం వరకూ ఫ్యాక్టరీని మూసి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే స్మార్ట్ ఫోన్లను వియత్నాం, భారత్ కు పంపిస్తూ ఉంటారు.

దక్షిణ కొరియా లోని రెండో అతి పెద్ద నగరం అయిన బుసాన్ లో కూడా వైరస్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. జెజు ఐలాండ్ లోని ఈ నగరం టూరిస్టులను విపరీతంగా ఆకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో చాలా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. డేగు, చియాంగ్డో కౌంటీలలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. 'స్పెషల్ కేర్ జోన్' లను ఏర్పాటు చేశారు. అధికారులు మిలటరీ మెడికల్ స్టాఫ్, ఇతర హెల్త్ వర్కర్లలను అక్కడకు పంపారు. వైద్యానికి సంబంధించిన సామాగ్రి, ఆసుపత్రి బెడ్లను తరలించారు. ఇప్పటివరకూ నమోదైన చాలా కేసులకు 61 సంవత్సరాల ఓ మహిళకు సంబంధం ఉందని అంటున్నారు. 'పేషెంట్ 31' అని పిలవబడుతున్న ఆ మహిళ డేగు లోని షిన్చియోంజి చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆమె నుండే ఇతరులకు 'ఫ్లూ' లక్షణాలు సోకాయని చెబుతున్నారు. ఆమె ఇటీవలి కాలంలో ఇతర దేశాలకు వెళ్లినట్లు కూడా రికార్డుల్లో లేదట. కొత్తగా నమోదయిన 39 కేసుల్లో.. తొమ్మిది మంది గత నెలలో ఇజ్రాయెల్ కు వెళ్ళొచ్చారని నార్త్ జియోంగ్సన్గ్ ప్రావిన్స్ గవర్నర్ లీ కియోల్-వూ తెలిపారు.

Next Story