అతడు కరోనా కారణంగానే చనిపోయాడా..? 

కరోనా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడన్న వార్త పలువురిని కలవరపెడుతోంది. కోవిద్-19 కారణంగా 36 సంవత్సరాల ఓ వ్యక్తి ఎర్నాకుళం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూమోనియా అధికంగా రావడంతో అతడు మరణించాడని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన వ్యక్తి గురువారం నాడు మలేషియా నుండి కొచ్చి కి చేరుకున్నాడు. అతడిలో కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, అలసట, దగ్గు అధికంగా ఉండడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి చేర్చారు. అలాగే అతడికి కీటోఅసిడోసిస్ అనే సమస్య కూడా ఉంది. డయాబెటిస్ అతడి శరీరంలో అధికంగా ఉండడం వలన కోలుకోలేకపోయాడు అని వైద్యులు తెలిపారు.

అతడు కరోనా వైరస్ తోనే చనిపోయాడని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అతడి స్పెసిమెన్స్ ను అలప్పుజ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవి) సెంటర్ కు పంపగా కోవిద్-19 విషయంలో నెగటివ్ గా వచ్చిందని డాక్టర్ అమర్ తెలిపారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రెండు రోజులకు అతడు చనిపోయాడని.. అతడి డీప్ స్పెసిమెన్స్ ను శనివారం ఎన్ఐవి కి పంపామని మరికొన్ని పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ రావాలని అమర్ చెబుతున్నారు. అవి వచ్చాకనే పూర్తీ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం మలేషియాలో ఆ వ్యక్తి ఉన్నప్పుడే వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడని.. అలాగే భారత్ కు వచ్చాడని తెలుస్తోంది. హెల్త్ మినిస్టర్ కెకె శైలజ మాట్లాడుతూ అతడు కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్పుడే కనీసం నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడని అన్నారు. అతడిని వెంటనే అంబులెన్స్ లో ఐసోలేషన్ వార్డుకు తీసుకొని వెళ్లారు. అతడి పరిస్థితి మెరుగవ్వలేదని.. ప్రాణాలు వదిలాడని ఆమె అన్నారు. అతడి శాంపుల్స్ ను పంపగా మొదటి రిజల్ట్ నెగటివ్ గా వచ్చిందని ఆమె అన్నారు. మరిన్ని శాంపుల్స్ ను పూణే కు కూడా పంపామని.. ఫైనల్ రిజల్ట్ అక్కడి నుండి రావాలని ఎర్నాకుళం జిల్లా మెడికల్ ఆఫీసర్ ఎన్.కె.కుట్టప్పన్ తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.