ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు ఖచ్చితంగా వచ్చే క్రీడల్లో బాక్సింగ్ కూడా ఒకటిగా చెబుతుంటారు. అందుకనే మన బాక్సర్లకు అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. వచ్చే నెల ఒలింపిక్ క్వాలిఫయర్స్  మన బాక్సర్లకు చాలా కీలకం. ఇప్పుడు మన బాక్సర్లకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు భారత బాక్సర్లు. 13 మంది బాక్సర్లు, అలాగే పదిమందికి పైగా ట్రైనింగ్ సిబ్బంది ఇటలీలో ట్రైనింగ్ లో ఉన్నారు. ఉంబ్రియాకు సమీపంలో ఉన్న అస్సిసీలో ఉన్న బాక్సర్లకు కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అని భయంగా భయంగా గడుపుతూ ఉన్నారు. అంతగా వారు భయపడడానికి కారణం ఇటలీలో వైరస్ ప్రబలడమే.

ఇటలీలో కరోనా వైరస్ సోకి 7 మంది మరణించారు.. 229 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నార్తర్న్ లాంబార్దీ రీజన్ లో కోవిద్-19 వైరస్ విపరీతంగా ప్రబలుతూ ఉండడంతో బాక్సర్లు ఇటలీ నుండి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందే అక్కడి నుండి వెళ్లిపోవాలని భావిస్తున్నారు.

మార్చి 3 నుండి జోర్డాన్ లో ఒలింపిక్స్ క్వాలిఫయర్లను నిర్వహించబోతున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే ముందే ఇటలీ నుండి జోర్డాన్ కు భారత బృందం వెళ్లనుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం చైనాలోని వుహాన్ లో ఈ ఒలింపిక్ క్వాలిఫయర్లను నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడంతో పోటీని జోర్డాన్ కు తరలించారు.

భారత హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా మాత్రం ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అనుకున్న తేదీ కంటే ముందుగానే జోర్డాన్‌కు బయలుదేరి వెళ్లాలని బాక్సర్లు  ఇటలీ అధికారులను సంప్రదించారు. కరోనా వైరస్ కేసులున్న ప్రాంతానికి ఉంబ్రియా చాలా దూరంలో ఉందని వారు భరోసా ఇవ్వడమే కాకుండా.. ఎలాంటి భయాందోళనలు లేకుండా బాక్సర్లు శిక్షణ కొనసాగించవచ్చని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే భారత బాక్సర్లు శిక్షణ ముగించుకుని జోర్డాన్ కు వెళ్లనున్నారు. భారత బాక్సింగ్ బృందం లోని స్టార్స్ ఎం.సి.మేరీ కోమ్, అమిత్ పంఘాల్, వికాస్ కృష్ణన్ తో పాటు మరికొందరు శుక్రవారం నాడు రోమ్ నుండి జోర్డాన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలడంతో ఇటలీ లోని 11 టౌన్(10-లాంబార్డీ రీజన్ లోని టౌన్లు, 1-వెనెటో తూర్పు భాగం) లను ప్రస్తుతం లాక్ డౌన్ చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.