కరోనా భయంతో పెళ్లికిరాని అతిథుల కోసం.. కొత్త జంట ఏం చేసిందంటే..

By Newsmeter.Network  Published on  7 Feb 2020 2:56 PM GMT
కరోనా భయంతో పెళ్లికిరాని అతిథుల కోసం.. కొత్త జంట ఏం చేసిందంటే..

చైనాలో వందల మంది ప్రాణాల్ని బలిగొంటూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. చైనా వెళ్లేందుకు అందరూ జంకుతున్నారు. కరోనా దెబ్బకు షేర్‌ మార్కెట్లు, బంగారం ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు ఈ వైరస్‌ పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభావం చూపుతోంది.

ఇటీవల కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లతో బిజీగా ఉన్న చైనాలోని ఓ డాక్టర్‌.. తన పెళ్లికి కేవలం 10 నిమిషాలు హాజరై.. మళ్లీ తన విధులకు వెళ్లారు. ప్రస్తుతం మరో నూతన జంటను ఈ వైరస్‌ ఇబ్బందులకు గురిచేసింది. సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబం చైనాలో స్థిరపడింది. అక్టోబర్‌లో ఈ కుటుంబానికి చెందిన జోసెఫ్ యూ, కాంగ్ టింగ్ అనే ఓ జంట చైనాలో పెళ్లి చేసుకున్నారు. కొద్ది మంది బంధువులు వారి పెళ్లికి హాజరుకాలేదు. వివాహానికి హాజరు కానీ బంధు మిత్రులకు సింగపూర్‌ లో గ్రాండ్‌ గా పార్టీ ఇవ్వాలని భావించారు. అయితే ఆ పార్టీకి రావడానికి బందువులు జంకుతున్నారట. వీరు చైనాలో నివసించి రావడమే అందుకు కారణం. చైనాలో కరోనా వైరస్‌ అధికంగా ఉండడంతో.. వీరి ద్వారా తమకు వ్యాపించే అవకాశం ఉందని వారు బావిస్తున్నారట.

ఇది తెలిసిన.. కొత్త జంట ఓ సరికొత్త ఆలోచన చేశారు. సింగపూర్‌లోని హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేసి.. గ్రాండ్‌గా రెడీ అయ్యి వేదిక వద్ద జరిగే వేడుకలను హోటల్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. స్నేహితులు, బంధువులు ఆ లైవ్ లోనే కొత్త జంటను ఆశీర్వదించారట.

కాగా దీనిపై పెళ్లి కొడుకు జోసెఫ్ యూ మాట్లాడాడు. అతిథులు వేడుకకు రావడానికి ఆందోళన చెందడంతో రిసెప్షన్‌ వాయిదా వేయాలని అనుకున్నామని.. కానీ కుదరకపోవడంతో ఈ విధంగా చెయాల్సి వచ్చిందన్నాడు. సోషల్ మీడియాలో ఈ వేడుక వైరల్ గా మారింది.

Next Story