ఒక వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల దృఢచర్యలు తీసుకుంటూండగానే మరో వైపు వీ ఐ పీ కల్చర్ నిబంధనలన్నిటినీ తుంగలోకి తొక్కేస్తోంది. కరోనా వ్యాధి వచ్చిందన్న సందేహం ఉన్న వారందరినీ మిగతా కుటుంబ సభ్యుల నుంచి వేరు చేసి, ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి, పధ్నాలుగు రోజుల పాటు పరీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను గాంధీ ఆస్పత్రిలో క్వారంటైన్ వార్డును కూడా ఏర్పాటు చేసింది. కానీ మన హైదరాబాద్ లోనే ఒక వీవీఐపీ గారి కుటుంబంలో రెండు సందేహాస్పద కేసులుంటే, నిబంధనలకు, కరోనా ప్రోటోకాల్ కు పూర్తి విరుద్ధంగా వారి శాంపిల్స్ సేకరించేందుకు ఆస్పత్రి సిబ్బంది నేరుగా వారి ఇంటికే వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read :
ఇంట్లోనే కరోనా పరీక్షలు చేయించుకున్న వీవీఐపీ కుటుంబం

గత బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ నాయకుడి ఇంటికే ఆస్పత్రి సిబ్బంది వెళ్లి రెండు సాంపిల్స్ ను సేకరించారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే కరోనా వైరస్ ఉన్నట్టుగా అనుమానిస్తున్న వ్యక్తులు కుటుంబాల్లో ఉంటూ, అటూ ఇటూ తిరుగుతూ ఉంటే వ్యాధి మరింత వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ ఈ కనీస నియమాన్ని తుంగలో తొక్కి అనుమానితులు ఇద్దరూ వీఐపీ గారి ఇంట్లోనే ఉండటమే కాక అందరినీ కలుస్తున్నారు. వారి సాంపిల్స్ సేకరించేందుకు సిబ్బందే వారి ఇంటికి వెళ్లింది. నగర శివార్లలో ఉన్న వారింటికి వెళ్లి సాంపిల్స్ సేకరించారు. ఈ మొత్తం ఉదంతంలో అదృష్టం ఒక్కటే. వారిద్దరికీ పరీక్షల్లో నెగటివ్ గా వచ్చింది.

“ఇలా చేయడం సబబు కాదు. నిజానికి కరోనా సోకిందన్న అనుమానం ఉంటే ముందు వారిని గాంధీ ఆస్పత్రికి తీసుకుని వచ్చి క్వారంటైన్ వార్డులో ఉంచాలి. వారి శాంపిల్స్ సేకరించి ప్రత్యేకంగా కేటాయించిన లాబ్ కి పంపాలి. కానీ వీవీఐపీ అయినంత మాత్రాన ఈ నియమాలన్నిటికీ నీళ్లొదలాలా? ఇలా చేయడం సబబేనా? వ్యాధిని అరికట్టే దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇలాంటి తప్పుడు చర్యల వల్ల విఫలమైపోతాయి,” అని ఒక వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే వీఐపీ కల్చర్ బాగా అలవాటైపోయిన మన దేశంలో ఇలాంటివన్నీ చెవిటివాడి ముందు ఊదిన శంఖాల్లాంటివే.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.