హైదరాబాద్ లో కరోనా వైరస్ ఎంటర్ అయ్యిందని తెలియగానే పలువురు ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి వైరస్ సోకిందని తెలియగానే.. ఆ వ్యక్తి చుట్టుపక్కల వారు.. అతడితో కలిసి పనిచేసిన వారు తెలియని టెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నామని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చేశారు. పిల్లలకు ఎక్కడ ఈ వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు-మూడు ఇళ్లల్లో పనిచేసే పనివాళ్లను కూడా రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను దరికి రాకుండా చేయొచ్చని చెబుతున్నా చాలా మంది ఎక్కడ తమకు సోకుతుందోనని లేనిపోని భయాలను వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లో మహేంద్ర హిల్స్ లో ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు'(ఎస్.సి.బి.) కరోనా వైరస్ సోకిన టెక్కీ ఇంటి పరిసరాల్లో ‘స్ప్రే’ జల్లడం మొదలు పెట్టింది. కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది.

జీహెచ్ఎంసీ వైరస్ నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ ను చల్లించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను కూడా తీసివేయించారు. ఓపెన్ ప్లాట్స్ లో ఉన్నటువంటి చెత్తను కూడా ఏరివేయించారు. 30 మంది గ్రౌండ్ లెవెల్ లో పారిశుధ్యంపై పనిచేస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుధ్యం ఉండడం కోసం మరో 10 మందిని నియమించింది జీహెచ్ఎంసీ.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ సుపరింటెండెంట్ ఎం.దేవేందర్ మాట్లాడుతూ ‘ఇతర కాలనీ వాసుల్లో వైరస్ ప్రబలకుండా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నామని..’ అన్నారు. కాలనీ వాసులకు వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరచి చెప్పారు. స్థానికులకు మాస్కులను ఉచితంగా సరఫరా చేశారు.

హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిసి కాలనీ వాసులకు వైరస్ గురించి అవగాహన కల్పించామని..ముఖ్యంగా చిన్న చిన్న చర్యలు చేపట్టడం వలన వైరస్ దరికి రాదనే నమ్మకాన్ని తాము కలిపించామని.. సందేహాలను నివృత్తి చేయడానికి కాలనీ వాసులతో ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేశామని ఎస్.సి.బి. వైస్ ప్రెసిడెంట్ జె.రామకృష్ణ తెలిపారు. సొంత ప్లాట్ లు ఉన్న యజమానులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా సోకడంతో..

సికింద్రాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇటీవలే దుబాయ్ కు వెళ్లి వచ్చాడు. అతడికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియడంతో వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాపై అప్రమత్తమైంది. కేబినెట్ సబ్‌కమిటీ అత్యవసరంగా సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది తెలంగాణ సర్కార్. కరోనా వైరస్‌పై బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేస్ నమోదైనట్టు ఆ బులెటిన్‌లో తెలిపారు. ఇప్పటి వరకు 155 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని..అందులో 118 మందికి నెగిటివ్‌గా తేలిందని..మరో 36 మంది అనుమానితుల రిపోర్ట్స్ రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.