కరోనా వైరస్ బాధితుల్లో 80 శాతం మంది రికవర్ అయ్యారట..!        

By రాణి  Published on  19 Feb 2020 7:55 AM GMT
కరోనా వైరస్ బాధితుల్లో 80 శాతం మంది రికవర్ అయ్యారట..!        

కరోనా వైరస్(COVID-19) బారిన పడి చైనాలో ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారిన పడి సతమతమవుతున్న వాళ్ళు మరికొందరు ఉన్నారు. COVID-19 పాజిటివ్ గా వచ్చిన వారిలో 80 శాతానికి పైగా రికవర్ అయినట్లు తాజా డేటా చెబుతోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం కరోనా వైరస్ బారిన పడినోళ్లలో 80 శాతం మంది రికవర్ అయ్యారని.. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళపైనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందట. తాజా నివేదిక పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కు ఎంతగానో ఉపయోగపడనుంది. ఫిబ్రవరి 11వరకూ కరోనా వైరస్ బారిన పడిన 72000 మందిని పరీక్షించి ఈ నివేదిక తయారుచేశారు.

చైనీస్ డేటా ను పరిశీలించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూ.హెచ్.ఓ.).. కరోనా వైరస్ బారిన పడినోళ్లలో 80 శాతం మంది రికవర్ అయ్యారని.. మిగిలినవారు కూడా వేగంగా కోలుకుంటూ ఉన్నారని చెబుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో 9 సంవత్సరాల లోపు వయసు వారిలో మరణించిన వారి సంఖ్య 'సున్నా' శాతం అని తాజా డేటా తెలిపింది. 39 సంవత్సరాల వయసులోపు వారిపై ఈ వైరస్ ప్రభావం చూపడం కేవలం 0.9 శాతం మాత్రమేనని చెబుతున్నారు. డబ్ల్యూ.హెచ్.ఓ. మాత్రం కోవిడ్-19 వైరస్ SARS, MERS అంత ప్రాణాంతకమైంది కాదని చెబుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 30 నుండి 79 సంవత్సరాల వయసు ఉన్న వారే 86 శాతం మంది. 80 ఏళ్ల వయసు పైబడిన వారే ఎక్కువగా చనిపోతున్నారు. 9 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారెవరూ చనిపోలేదు. హృద్రోగాలు, డయాబెటిస్, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్న వాళ్ళే ఎక్కువగా కోవిడ్-19 బారిన పడుతున్నారు.

వైరస్ తగ్గుముఖం పడుతోందా..?

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఇటీవలి కాలంలో బాగా తగ్గినట్లు చెబుతున్నారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులు చైనాలో భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పడంతో అక్కడి అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఓపిక పడితే కానీ పూర్తిగా వైరస్ తగ్గుముఖం పట్టిందా లేదా అన్న అంచనాకు రాలేమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ గీబ్రెయేసుస్ చెప్పుకొచ్చారు. సరికొత్త డేటా కూడా పంపించాలని చైనా ఆరోగ్య శాఖను ఆయన కోరారు. కొత్త డేటా ద్వారా ప్రపంచానికి మరిన్ని విషయాలు తెలియజేయడమే కాకుండా.. వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

Next Story