డైమండ్ ప్రిన్సెస్ లో 41 మందికి కరోనా పాజిటివ్..

By రాణి  Published on  7 Feb 2020 6:16 AM GMT
డైమండ్ ప్రిన్సెస్ లో 41 మందికి కరోనా పాజిటివ్..

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒక్క చైనాలోనే కాకుండా 26 దేశాలకు ఇది వ్యాపించడంతో..కరోనా వ్యాధిగ్రస్తులతో ఆస్పత్రులు ఫుల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చైనా లో మరణించిన వారి సంఖ్య 636 కు చేరింది. గురువారం ఒక్కనాడే 73 మంది మరణించడం..వారిలో కరోనాను మొదటగా గుర్తించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌ కూడా ఉండటం చైనా ప్రజలను కలవరపెడుతోంది.

కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని ముందే హెచ్చరించిన వుహాన్‌ డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ అదే వైరస్‌ బారిన పడి మృతి చెందారు. సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తన ఆస్పత్రిలో చేరారని, వారిని పరీక్షించగా సార్స్‌ బారిన పడ్డారని తేలిందని, దేశంలో ఈ వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉందంటూ లీ.. డిసెంబరు 30న తన వీ చాట్‌ గ్రూప్‌లో హెచ్చరించారు. ఈ పోస్టు చేసినందుకు పోలీసులు ఆయనను ఇబ్బంది పెట్టారు. కరోనా బారిన పడి జనవరి 12 నుంచి చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు.

ఈ వైరస్ వ్యాపించడానికి మూలకారణమైన వూహాన్ నగరంలో 63 మంది మృతి చెందారు. మరోవైపు 3,143 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా..1540 మంది కరోనా నుంచి విముక్తులై ఇళ్లకు చేరుకున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా చైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకు 1500 పడకలతో కూడిన మరో ఆస్పత్రిని ప్రారంభించింది చైనా ప్రభుత్వం.

జపాన్ లోని యొకోహోమా తీరానికి సోమవారం చేరుకున్న డైమండ్ ప్రిన్సెస్ విహాక నౌకలో ఉన్న 3711 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నౌకలోనే ప్రయాణించి వుహాన్ లో దిగగా..ఆ వ్యక్తికి అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు చేసి..అతడికి వైరస్ సోకిందని నిర్థారించారు. దీంతో జపాన్ కు వెళ్లిన నౌకలో ఉన్న ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు చేయగా..వారిలో 41 మందికి వైరస్ ఉందని నిర్థారించారు డాక్టర్లు. ఇప్పుడు మొత్తం 61 మందికి వైరస్ పాజిటివ్ అని వచ్చిందని తెలిపారు.Next Story