కరోనా వైరస్ అపోహలకు సమాధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

By రాణి  Published on  5 March 2020 8:14 AM GMT
కరోనా వైరస్ అపోహలకు సమాధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

కరోనా వైరస్.. ఎక్కడ చూసినా ఇవే వార్తలు..! కొన్ని మీడియా సంస్థలైతే ఇదిగో పులి అంటే..అదిగో తోక అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని పదార్థాలు వాడితే కరోనా అసలు దరిచేరదంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.

ఆవు పేడ, గోమూత్రం, యోగా చేయడం, మద్యాన్ని తాగడం, వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించడం, హోమియోపతి యునానీ మందులతో కరోనా ను అరికట్టవచ్చంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ కరోనాను అరికట్టే ఎటువంటి మందులు రాలేదని 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' చెబుతోంది. కోవిద్-19 ను అరికట్టడానికి వేరే పద్ధతులు ఉన్నాయని.. కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారులు చెబుతున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.

* ఆల్కాహాల్ లేదా క్లోరిన్ ను శరీరం మీద చల్లడం వలన వైరస్ ను చంపలేము

*ఆల్కాహాల్(మద్యాన్ని) తీసుకోవడం వలన కూడా కోవిద్-19 ను అరికట్టవచ్చన్నది అపోహ మాత్రమే

*వెల్లుల్లి తినడం వలన.. వెల్లుల్లితో రూపొందించిన పదార్థాలు తినడం వలన కోవిద్-19 ను అడ్డుకోవడం కుదరదు

*నువ్వుల నూనె కరోనాను చంపుతుందని అనుకోవడం అపోహలు మాత్రమే

*వైరస్ లను యాంటీ బయోటిక్ చంపలేవు కానీ.. కేవలం బ్యాక్తీరియాను మాత్రమే అంతం చేయగలవు

*సిగరెట్లు తాగడం వలన కోవిద్-19 ను అడ్డుకోవాడనికి కుదరదు

భారత్ లో విపరీతంగా వైరల్ అవుతున్న 'అపోహ' లకు సంబంధించిన వార్తలు

వదంతి : ఆవు పేడ, గోమూత్రం, యోగా చేయడం వలన కోవిడ్-19 ను అరికట్టవచ్చు

గో మూత్రం, ఆవు పేడ తో కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని భారతీయ జనతా పార్టీ నేత సుమన్ హరిప్రియ అన్నారు. మార్చి 2 న ఈ వ్యాఖ్యలు చేశారు. యోగా చేయడం కారణంగా మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని..ప్రాణాంతక వైరస్ నుండి మనిషిని కాపాడుతుందని..రోగ నిరోధక శక్తి అన్నది తగ్గిపోతే మనిషిని కాపాడడం కుదరదని బాబా రామ్ దేవ్ ఫిబ్రవరి 22న వ్యాఖ్యానించారు.

వీటిలో నిజమెంత : గ్లోబల్ హెల్త్, బయో ఎథిక్స్ హెల్త్ పాలసీ రీసెర్చర్ అనంత్ భన్ మాట్లాడుతూ ఆవు పేడ, గోమూత్రం వలన వైరస్ అరికట్టడం అన్నది కుదరని పని అవన్నీ వదంతులేనని చెప్పుకొచ్చారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వదంతులను ప్రచారం చేయడం చాలా పెద్ద తప్పని అనంత్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ను సైంటిఫికల్లి ఎదుర్కొందామని.. అనవరసమైన వందతులు ఎవరు చేసినా తప్పేనని అన్నారు.

ఇప్పటివరకూ కరోనా వైరస్ కు ట్రీట్మెంట్ గా ఎటువంటి మందు కనిపెట్టలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోందని.. అయినప్పటికీ కొందరు అనవసరమైన రెమిడీలు చెబుతున్నారని అన్నారు. రోగుల్లో ఉన్న కరోనా వైరస్ వ్యాధి లక్షణాలను డాక్టర్లు నశింపజేసి.. ఆరోగ్యవంతులుగా చేస్తున్నారని అన్నారు. యాంటీ బయోటిక్స్ విషయంలో అసలు నిజాన్ని ఆయన బయటకు తెలిపారు. కరోనా రోగులకు యాంటీ బయోటిక్స్ ఇవ్వడానికి ముఖ్య కారణం బ్యాక్టీరియా నుండి మరిన్ని ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి మాత్రమేనని చెప్పుకొచ్చారు.

వదంతి : ప్రభుత్వానికి చెందిన 'ఆయుష్ మినిస్ట్రీ' ఆయుర్వేదాన్ని వాడమని సలహా ఇచ్చిందని .. ఆయుర్వేదిక్, యునానీ మందులు వాడితే కోవిద్-19 ను అరికట్టవచ్చని జనవరి 29, 2020 నుండి వార్త ప్రచారంలో ఉంది.

వీటిలో నిజమెంత : కోవిద్-19 ను అరికట్టడానికి ఎటువంటి నాచురల్ రెమెడీలు రాలేదని మణిపాల్ యూనివర్సిటీ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ డాక్టర్ జి.అరుణ్ కుమార్ తెలిపారు. ఇలాంటి సమయంలో అయినా సరైన సమాచారాన్ని ఇతరులకు పంచాలని ఆయన అన్నారు. చేతులు బాగా కడుక్కుంటే వైరస్ అన్నది స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టవచ్చని ఆయన అన్నారు. హోమియోపతి, యునానీ మందులు క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లి ఉండవని.. వాటి వలన కరోనా వ్యాప్తిని అరికట్టడం అన్నది జరుగుతుందని భావించడం కూడా తప్పేనని అరుణ్ కుమార్ అన్నారు.

సైంటిఫిక్ కమ్యూనిటీ ఇటువంటి మందులను అసలు ఒప్పుకోదని అనంత్ భన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. హెల్త్ మినిస్ట్రీ కూడా కాస్త అవగాహనతో వ్యవహరించాలని అనంత్ భన్ అన్నారు. హెల్త్ మినిస్ట్రీ అధికారులు మాట్లాడుతూ చేతులు కడుక్కోవడం వలనా, హైజీన్ గా వ్యవహరించడం వలన వైరస్ ను అరికట్టవచ్చని చెబుతున్నారని.. దీన్ని నమ్మాలో లేక ఆయుష్ మినిస్ట్రీ చెప్పిన విషయాలు నమ్మాలో ప్రజలకు అర్థం కాదని అన్నారు. తప్పుడు సమాచారాన్ని అందించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని అనంత్ భన్ అన్నారు.

అఫీషియల్ గా ఏదైనా ప్రకటన విడుదల చేసే సమయంలో సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందా.. వారు ప్రకటించే మందుల కారణంగా ఎంత మేలు జరిగింది అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాలని అరుణ్ కుమార్ అన్నారు.

వీటి కారణంగా కరోనాను అరికట్టవచ్చు

కోవిద్-19 ప్రబలకుండా చేతులను ఎప్పటికప్పుడు కడుక్కోవాలని వైద్యులు సూచించారు. దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవడం.. లేదా కర్చీఫ్ లాంటివి వాడాలని సూచించారు. ఎవరైనా దగ్గుతున్నా, తుమ్ముతున్నా కనీసం ఒక మీటర్ దూరం ఉండాలని అన్నారు. జ్వరం, అలసట, పొడి దగ్గు లాంటివి వైరస్ లక్షణాలు అని అధికారులు చెబుతున్నారు.

తల నొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కులో నుండి నీరు కారుతుండడం, గొంతులో మంట, డయేరియా లాంటి లక్షణాలు రోగుల్లో కనిపించాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు తెలిపారు. స్పెషల్ ట్రీట్మెంట్ అన్నది లేకుండానే దాదాపు 80 శాతం మంది రోగులు కరోనా నుండి తేరుకున్నారని అన్నారు. ఆరు మంది రోగుల్లో ఒకరికి మాత్రమే శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పుకొచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా దరికి చేరాడని వైద్యులు చెబుతున్నారు.

Next Story