కరోనా వైరస్..తెలంగాణలో హై అలర్ట్

By రాణి  Published on  3 Feb 2020 9:48 AM GMT
కరోనా వైరస్..తెలంగాణలో హై అలర్ట్

కరోనా వైరస్..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలు ఈ వైరస్ దెబ్బకు గజగజలాడుతున్నాయి. తమ తమ దేశాల్లోకి ఆ వైరస్ సోకిన వ్యక్తులు ప్రవేశించకుండా రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు సంబంధించి హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. సింగపూర్, థాయ్ లాండ్ నుండి వచ్చే ప్రయాణికుల విషయంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం అర్ధరాత్రి నుండే ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు మొదలయ్యాయి. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వారిని ప్రత్యేక ఛాంబర్ లో ఉంచనున్నారు.

సింగపూర్ కు కూడా కరోనా వైరస్ వ్యాపించింది. ఇప్పటి వరకూ అక్కడ దేశంలో 18 కేసులు నమోదయ్యాయి. ప్రయాణికుల్లో వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు థర్మల్ స్కానర్స్, థర్మల్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకూ చైనా, హాంగ్ కాంగ్ నుండి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఉండే ఈ స్కానింగ్ ఇప్పుడు సింగపూర్, థాయ్ లాండ్ నుండి వచ్చే ప్రయాణికులకు కూడా చేయనున్నారు.

ఎవరైతే విపరీతమైన బాడీ టెంపరేచర్ ను కలిగి ఉన్నారో వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎక్కడికి వెళ్లారు.. ఎలాంటి ప్రదేశాల్లో తిరిగారు లాంటి సమాచారాన్ని సేకరించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవి కరోనా వైరస్ లక్షణాలా కాదా అన్నది కూడా తెలుసుకోనున్నారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల ప్రకారమే సింగపూర్, థాయ్ లాండ్ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రయాణికులు స్వతహాగా కూడా తమకు ఎటువంటి వైరస్ లేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల అవగాహన కోసమై విమానాల్లోనూ, ఎయిర్ పోర్టుల్లోనూ ఇప్పటికే అనౌన్స్ మెంట్స్ చేశారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, విపరీతమైన జలుబు ఉన్నా సంబంధిత అధికారులను కలవాలని కూడా సూచనలు చేస్తున్నారు.

ఫీవర్, గాంధీ లలో ఐసోలేషన్ వార్డులు

గత రెండు రోజుల్లో ఐదు మంది తెలంగాణకు చెందిన వ్యక్తులను చైనాలోని వుహాన్ నుండి భారత్ కు రప్పించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు తమకు కూడా ఈ సమాచారం అందిందని.. కానీ అధికారికంగా ధృవీకరించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫీవర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.

చైనా నుండి వచ్చిన ఓ వ్యక్తి ప్రస్తుతం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. కరోనా వైరస్ ఆ వ్యక్తికి సోకిందా లేదా అని తెలుసుకునేందుకు శాంపిల్స్ ను కలెక్ట్ చేశారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినట్లు నిరూపితం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కొందరి శాంపిల్స్ కు సంబంధించిన రిజల్ట్ కోసం వైద్యాధికారులు ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తం 30 శాంపిల్స్ ను ఒక్క సారిగా ల్యాబ్ లో టెస్టు చేయడానికి వీలు ఉంటుంది. ఒక టెస్ట్ సైకిల్ పూర్తి అవ్వడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది.

Next Story