వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదట

By సుభాష్  Published on  1 Nov 2020 3:21 AM GMT
వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదట

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో బిహార్ లో ఎన్నికల హామీల్లో భాగంగా కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా వేయిస్తామని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం.. దుమారం రేపింది. అయితే వ్యాక్సిన్ ఇస్తామనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని అంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల మోడల్ కోడ్‌ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీగా పేర్కోవడంపై ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిర్యాదు ఈసీ స్పందించింది.

ఈ సంఘటన మోడల్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. ఉచిత టీకా వాగ్దానం ఉల్లంఘించలేదని తేల్చడానికి మోడల్ ప్రవర్తనా నియమావళి యొక్క పార్ట్ VIII లో ఉన్న ఎన్నికల మ్యానిఫెస్టోల కోసం కమిషన్ కొన్ని మార్గదర్శకాలను ఉదహరించింది. ఈ వాగ్దానం వివక్షపూరితమైనదని, ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందని గోఖలే విమర్శించారు. ఇలా హామీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనా అని ప్రశ్నిస్తూ సాకేత్‌ గోఖలే.. ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు.

"రాజ్యాంగంలో పొందుపరచిన రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు పౌరులకు వివిధ సంక్షేమ చర్యలను రూపొందించమని రాష్ట్రానికి ఆజ్ఞాపించాయి. అందువల్ల ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇటువంటి సంక్షేమం యొక్క వాగ్దానానికి అభ్యంతరం ఉండదు" అని ఎన్నికల సంఘం తన నిబంధనలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఓటర్లు విశ్వసించగల వాగ్దానాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఎన్నికల మ్యానిఫెస్టోలను రాజకీయ పార్టీలు, ఒక నిర్దిష్ట ఎన్నికకు సంబంధించి జారీ చేస్తారని ఈసీ తెలిపింది.

Next Story