తస్మాత్ జాగ్రత్త.. కరోనాపై మరిన్ని పరిశోధనలు
By సుభాష్ Published on 28 Oct 2020 4:12 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా కట్టడికి అన్ని దేశాల సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. గతంలో తీవ్రంగా ఉన్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అయినా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, లేకపోతే మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కరోనాపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. పరిస్థితులను బట్టి వైరస్ రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతోందని వెల్లడిస్తున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు తుది దశకు, మూడు, రెండు దశల్లో మరికొన్ని ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మరో వైపు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందోనన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోయినా.. ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? లేదా ..? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ వైరస్ వ్యాప్తిపై ఓ ప్రకటన విడుదల చేసింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ తెలిపింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ మరోసారి గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు ప్రజలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
తుంపర్లలో వైరస్ ఉంటుంది
కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం మాత్రమే ప్రయాణించి ఆ తర్వాత పేలిపోయి, వైరస్ నేలపై పడిపోతుంది. అలాంటి సమయంలో ఆరు అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్ సోకే అవకాశం ఉంటుందని సీడీసీ స్పష్టం చేసింది.
ఆరడుగులు దూరం ఉన్నా.. వ్యాప్తి చెందుతుంది
మరో వైపు గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రాంతాల్లో తుంపర్ల ద్వారా వైరస్ కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని, అలాంటి సమయంలో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.
గాలిలో ఎంతసేపు బతికి ఉంటుంది..?
అయితే వైరస్ గాలిలో ఎంతసేపు బతికి ఉంటుందన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీని వ్యవధి కొన్ని సెకన్ల నుంచి గంటల వరకు ఉండొచ్చని సీడీసీ అభిప్రాయపడింది. గాలి గానీ, వెలుతురు గానీ అధికంగా ఉన్న సమయంలో తుంపర్లు త్వరగా పేలిపోవడం, ఆవిరవడం జరుగుతుందని, దీని వల్ల వైరస్ తొందరగా నశించి వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కరు అరడుగుల దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తోంది.