తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  14 Jun 2020 12:11 PM GMT
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి వృద్దుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు. ఇక తెలంగాణలో ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకగా, తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో ఆస్పత్రిలో చేరేందుకు బాజిరెడ్డి గోవర్ధన్‌ హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా, నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా, భార్యకు నెగిటివ్‌ రాగా, బాజిరెడ్డికి పాజిటివ్‌ తేలింది.

కాగా, టీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే.. రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యేకు సోకింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో వారిని ఎవరెవరు కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కాగా, ఆదివారం తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్న ఒక్క రోజే 253 కరోనా కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4737కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన 449 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 182కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2203గా ఉంది. వైరస్ నుంచి 2352 మంది కోలుకున్నారు.

Next Story