పాతికేళ్లుగా కాని పనిని..లాక్ డౌన్ చేసేసింది..

By సుభాష్  Published on  26 May 2020 12:57 PM GMT
పాతికేళ్లుగా కాని పనిని..లాక్ డౌన్ చేసేసింది..

ఎన్ని కోట్లు వ్యత్యించినా కాని పని లాక్ డౌన్ చేసి చూపించింది. దేశంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలు మార్చి 23 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన లాక్ డౌన్ నాలుగు దశల్లో రెండు నెలల వరకూ కొనసాగింది. ఈ రెండు నెలల లాక్ డౌన్ కాలంలో దేశంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. వాయు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఊహించని స్థాయిలో కాలుష్యం తగ్గింది. లాక్ డౌన్ లో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు సహా అంతా ఇంటికే పరిమితమవ్వడంతో కాలుష్యంతో కనుమరుగవుతున్న అందాలు బయటపడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే అనారోగ్యంగా ఉన్న ప్రకృతి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది.

కేవలం గాలి కాలుష్యమే కాదు..ఫ్యాక్టరీలు మూతపడటంతో నీటి కాలుష్యం కూడా తగ్గింది. మామూలు రోజుల్లో అయితే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను నదుల్లోకి వదలడం ద్వారా అవి వెళ్లి సముద్రంలో కలిసేవి. ఇలా ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలతో గంగా, యమునా నదులు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆ నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోయేమాట దేవుడెరుగు కానీ..నదిలో మునిగి స్నానం చేసినవారికి అంటువ్యాధులొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో 25 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నదుల ప్రక్షాళనకు కంకణం కట్టింది. ఈ మేరకు ముందుగా గంగానది ప్రక్షాళన పనులు చేపట్టారు. కానీ నదిలోనుంచి ఎన్ని వ్యర్థాలను తొలగించినా ఫలితం కనిపించలేదు.

Advertisement

అదే రీతిలో యమునా నది ప్రక్షాళనకు కూడా కేంద్రం రూ.5000కోట్ల నిధులతో పనులు మొదలుపెట్టింది. రోజు ఎంత మోతాదులో వ్యర్థాలను తొలగిస్తున్నారో అంతే మోతాదులో ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు ఉత్పన్నమవ్వడంతో ఇక్కడ కూడా ఫలితం శూన్యం. ఒక్క ఢిల్లీలోనే 300 ఫ్యాక్టరీల నుంచి వచ్చేవ్యర్థాలు యుమునా నదిలో కలుస్తాయంటే..నదిలోని నీరు ఏ స్థాయిలో కలుషితం అయిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 1400 కిలోమీటర్లు పొడవున ఏడు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డంతా కాలుష్యమే కనిపిస్తుండేది. నురగలు నురగలుగా ఉండే నీటిని చూసి..అందులో స్నానం చేయాలంటేనే జంకేవారు. ఇక ఆ నీటిని నిత్యావసరాలకు వాడే ఆస్కారం ఎక్కడుంది ?

Advertisement

కాగా..పాతికేళ్లుగా ఎన్ని నిధులు ఖర్చుపెట్టినా కనిపించని ఫలితం రెండు నెలల లాక్ డౌన్ కాలంలో కనిపించింది. సుమారు నెలరోజుల క్రితమే గంగానది స్వచ్ఛంగా మారిందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు యమునా నది కూడా స్వచ్ఛంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Next Story
Share it