దీపావళి నాటికి కరోనా అదుపులోకి వస్తుంది: కేంద్ర మంత్రి

By సుభాష్  Published on  1 Sep 2020 2:26 AM GMT
దీపావళి నాటికి కరోనా అదుపులోకి వస్తుంది: కేంద్ర మంత్రి

కోవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. దాదాపు 225 దేశాల వరకు వ్యాపించిన కరోనా మహమ్మారి కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా సోకకుండా భౌతిక దూరం, మాస్క్‌ లు తప్పనిసరిగా ధరించడం తప్పనిసరి అయ్యింది. ఇక దేశంలో కూడా రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం దీపావళి నాటికి కోవిడ్‌-19 పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అనంత్‌కుమార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ ఫస్ట్‌ వెబ్‌ సెమినార్‌లో పాల్గొన్నారు. కొంత కాలం తర్వాత కరోనా మిగిలిన వైరస్‌ల మాదిరిగానే ఒక సాధారణ సమస్యగా మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు.

వైరస్‌ మనకెన్నో కొత్త విషయాలు నేర్పింది

కాగా, కరోనా మహమ్మారి మనకెన్నో కొత్త విషయాలను నేర్పిందని, ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే మన జీవన విధానంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి టీకా వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాలు మన దేశంలో తక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. వ్యాక్సిన్‌ రాని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతర మార్గాలేమి లేవన్నారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లే సమయంలో మాస్క్లులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటిస్తే కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కరోనాపై లేనిపోని అనుమానాలు పెట్టుకుని చాలా అనారోగ్యం బారిన పడుతున్నారని, వైరస్‌ సోకిందని భయం పెట్టుకుని వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరోనా ప్రభావం చాలా తగ్గిపోయిందని, గతంలో ఉన్న వైరస్‌ ఎఫెక్ట్‌ ఇప్పుడు లేదన్నారు. ఎంతో మందికి కరోనా వచ్చిపోయినట్లు కూడా తెలియదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణుల చెబుతున్నారని, కరోనా సోకినా ఎవ్వరు కూడా భయపడవద్దని పేర్కొన్నారు.

Next Story
Share it