తెలుగు రాష్ర్టాల్లో కరోనా టెర్రర్ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి కరోనా నిర్థారణవ్వగా..అతను ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతను నివాసమున్న ప్రాంతంలో స్కూళ్లలో సెలవులివ్వడంతో పాటు..ఆ ప్రాంతంలో పారిశుధ్యం లేకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ జల్లడంతో పాటు..దోమలు ఎక్కువ కాకుండా స్ప్రేలు కొడుతున్నారు. ఉన్న సిబ్బందికి తోడు..మరికొంతమంది సిబ్బందిని జీహెచ్ఎంసీ విధుల్లోకి తీసుకురానుంది. కరోనా రాకుండా కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని అధికారులు చెప్తున్నారు.

N 95 Mask

కాగా..కరోనా వైరస్ (కోవిడ్ 19) కేవలం చేతులు తాకినా వ్యాపిస్తుందని తెలియడంతో ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఎవరినీ తాకకుండా ఉండాలని..చాలా మంది ఉద్యోగాలకు సెలవు పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి.. ఫేస్ మాస్క్. ఈ మాస్క్ ధర కరోనా వైరస్ హైదరాబాద్ లో రాకముందు వరకూ రూ.1.60 ఉన్న వాటిని కొందరు దుకాణ దారులు రూ.20-25కు, రూ.30-40 విలువగల ఎన్ 95 మాస్క్ లను ఏకంగా రూ.300కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క కరోనా ప్రజలను భయపెడుతుంటే..మరోపక్క హోల్ సేల్, రిటైల్ మార్కెట్లలో వ్యాపారస్తులు వినియోగదారుల జేబులను కొల్లగొడుతున్నారు. తప్పనిసరిగా కొనాలి కాబట్టి..చేసేది లేక వారు విక్రయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు.

ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద మాస్కులకు ఎక్కువ గిరాకీ వస్తోంది. జనరిక్ మెడిసిన్ షాపుల్లో కూడా ఈ మాస్క్ లను రూ.15-20 లకు విక్రయించడంలో ఆశ్చర్యం లేదు. మనవాళ్ల తెలివి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. మొన్నీమధ్య కూడా ఉల్లి దిగుమతులు లేక ధర పెరగడంతో..ఉల్లి వ్యాపారులు తమ వద్ద నిల్వ ఉన్నవి, కుళ్లిన స్థితిలో ఉన్న ఉల్లిని కూడా కిలో రూ.100లకు విక్రయించినా వినియోగదారులకు గతిలేక కిక్కురుమనకుండా దొరికినవే కొనుక్కున్నారు. ఇప్పుడు మెడికల్ షాపుల వాళ్లు కూడా కరోనా ను అడ్డంపెట్టుకుని వినియోగదారుల జేబులను కొట్టేస్తున్నారు. కరోనా రాకముందు 100 మాస్క్ ల ప్యాకెట్ ను రూ.160కు అమ్మగా..ఇప్పుడు అదే ప్యాకెట్ ను రూ.1600కు అమ్ముతున్నారంటే గిరాకీ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయొచ్చు. కొన్ని సార్లైతే తమ వద్ద మాస్క్ లు లేవని, కావాలంటే ప్రత్యేకంగా తెప్పిస్తామని..అందుకు ఎక్కువ ఖర్చవుతుందని చెప్తూ కూడా సొమ్ము చేసుకుంటున్నారు. హోల్ సేల్ మార్కెట్లో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉండటంతో..ఇప్పటికైనా అధికారులు మాస్క్ ల ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వినియోగదారులు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.