గోపీచంద్ అకాడమీని భయపెడుతున్న కరోనా.. సొంతవూళ్లకు వెళ్లిపోతున్నారు

By రాణి  Published on  6 March 2020 10:22 AM GMT
గోపీచంద్ అకాడమీని భయపెడుతున్న కరోనా.. సొంతవూళ్లకు వెళ్లిపోతున్నారు

పుల్లెల గోపీచంద్ అకాడమీని కరోనా భయం వెంటాడుతోంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రబలుతోంది అన్న వార్తలు విన్న ఆటగాళ్లు.. ట్రైనింగ్ మానేసి తమ తమ సొంత స్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో భారత షట్లర్లు పాల్గొనాల్సి ఉండగా.. ఆ టోర్నీకి కూడా హాజరవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని మొత్తం ఏడుగురు భారత స్టార్ షట్లర్లు తీసుకున్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బర్మింగ్హామ్ లో మార్చి 11 నుండి మార్చి 15 వరకూ నిర్వహించనున్నారు. ఆ దేశాల్లో కూడా వైరస్ విపరీతంగా ప్రబలుతూ ఉండడంతో షట్లర్లు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో పుల్లెల గోపీచంద్ అకాడెమీలు ఉన్న సంగతి తెలిసిందే..!

హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇద్దరు టెకీలకు కరోనా వైరస్ వచ్చిందని వార్తలు వచ్చాయి. హెచ్.ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, డబుల్స్ ప్లేయర్లు మన్ను అత్రి, సుమీత్ రెడ్డి, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి లు ఆల్ ఇంగ్లాండ్ సూపర్ 1000 ఈవెంట్ లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ అజయ్ సింఘానియా మాట్లాడుతూ పీవీ సింధు, సైనా నెహ్వాల్, బి.సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రాలు పాల్గొనబోతున్నారని తెలిపారు.

బ్యాడ్మింటన్ కేలండర్ లోనే ప్రతిష్టాత్మకమైన టోర్నీ

ఇప్పటికే మార్చి 3-8 మధ్య జరగవలసిన జర్మన్ ఓపెన్ రద్దైన సంగతి తెలిసిందే. ఇక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ కేలండర్ లోనే ప్రతిష్టాత్మకమైన టోర్నీ.. ఇది కూడా రద్దైతే ఒలింపిక్స్ కు అర్హత సాధించడం టాప్ ప్లేయర్స్ కు కష్టమవుతుంది. కానీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ మాత్రం ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ తప్పకుండా అనుకున్న సమయానికి నిర్వహిస్తామని స్పష్టం చేసింది. భారత షట్లర్లు ఆదివారం నాడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో పాల్గొనడానికి వెళ్ళాల్సి ఉండగా.. రానున్న రోజుల్లో మరికొందరు విత్ డ్రా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీలో పాల్గొనడం-పాల్గొనకపోవడం ఆటగాళ్ల చేతుల్లో ఉంటుందని సింఘానియా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండడం ఆటగాళ్లను కలవరపెడుతోంది ఆయన అన్నారు. ఆటగాళ్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పంపించాలా వద్దా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ లకు ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉండడంతో వారిద్దరూ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో ఖచ్చితంగా తలపడనున్నారు.

https://telugu.newsmeter.in/indian-womens-team-enters-final/

స్టార్ షట్లర్ సిక్కి రెడ్డి కూడా శుక్రవారం నాడు టోర్నమెంట్ లో పాల్గొనాలా లేదా అన్న విషయంపై తన నిర్ణయాన్ని తెలపనుంది. సిక్కిరెడ్డి ఇంకా గోపీచంద్ అకాడెమీలో ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతానికి తాను సొంత ఊరికి వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ వైరస్ లక్షణాలు సోకితే తనను ఐసోలేషన్ వార్డులో ఉంచుతారేమోనని ఆమె భయపడుతోంది. బి. సుమీత్ రెడ్డి ఒక్కడే గోపీచంద్ అకాడెమీలో ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడి పార్ట్నర్ మను అత్రి మాత్రం టోర్నమెంట్ లో పాల్గొనాలని అనుకోవడం లేదు.

గోపీచంద్ వెళ్లడం లేదా..?

బాయ్ అధికారులు మాట్లాడుతూ గోపీచంద్, నేషనల్ సెలెక్టర్ విమల్ కుమార్ భారత బృందంతో కలిసి వెళ్లాల్సి ఉండగా.. గోపీచంద్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గోపీచంద్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Next Story