బంగారం ధర ఊహించని విధంగా పెరిగిపోతూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో శుక్రవారం ఒక్క రోజే ‘1 శాతానికి’ పైగా బంగారం పెరిగిపోయింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి కారణం కరోనా వైరస్ అని అంటున్నారు. కోవిద్-19 విపరీతంగా ప్రబలుతుండడంతో గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళనలు ముదుపరుల్లో విపరీతంగా పెరిగాయి. ఇతర వస్తువులతో పోలిస్తే బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిదని భావించిన ముదుపరులు.. బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.

అలాగే దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి తాకింది. ఒక ఔన్సు బంగారం ధర 1,636.60 డాలర్లకు చేరింది. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా రెండు రోజుల క్రితం 42 వేల మార్క్ దాటిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.43 వేల వద్ద కొనసాగుతోంది.

కోవిడ్-19 కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయం వంటివి బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని కమోడిటీ విశ్లేషకులు చెబుతున్నారు. లోహాలపై పెట్టుబడులే సేఫ్ అని భావిస్తున్న మదుపర్లు ఈక్విటీలోని తమ పెట్టుబడులను అటువైపు మళ్లిస్తున్నారు.

సౌత్ కొరియాను కూడా కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అక్కడ ఏకంగా 52 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 156కు చేరింది. జపాన్ కూడా ఎక్కడ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందా అని భయపడుతోంది. ఇటీవలే క్రూజ్ షిప్ లో ఉన్న ప్రయాణీకులు సొంత ఊళ్లకు చేరడంతో ఎక్కడ వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందో అని భయపడుతోంది ఆ దేశ యంత్రాంగం. చైనాలోని జైళ్లలో కూడా వైరస్ బాధితులు పెరుగుతూ ఉన్నారు. హుబె ప్రావిన్స్ బయట ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలలో 200 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అధికమవుతూ ఉండడంతో ముదుపరులు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.