కరోనా వ్యాధి దెబ్బకి ఫ్యాషన్ రంగం..ముఖ్యంగా భారతీయ ఫ్యాషన్ రంగం..కోలుకోలేనంతగా కుదైలేంది. ఫ్యాషన్ రంగానికికరోనాకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఉందండీ… సంబంధం ఖచ్చితంగా ఉంది. భారతీయ ఫ్యాషన్ రంగంలో కొత్త ఫ్యాషన్ క్లోతింగ్ తయారు చేయాలంటే మన డిజైనర్లు ముందుగా చైనీస్ సిల్క్, సాటిన్ వస్త్రాలను తెప్పిస్తారు. అవి డిజైన్ చేయడానికి, కటింగ్ చేయడానికి చాలా అనుకూలం. చూడటానికి కూడా చాలా గార్జియస్ గా ఫెళఫెళలాడుతూ ఉంటాయి. ఫ్యాషన్ పరేడ్లలో చైనీస్ క్లాత్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ప్రస్తుతం చైనా కరోనా బారిన పడటంతో అక్కడినుంచి క్లాత్ ను దిగుమతి చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే బల్క్ ఆర్డర్స్ పంపిన భారతీయ డిజైనర్లకు ఆ ఆర్డర్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా పుణ్యమా అని ఉత్పాదన పూర్తిగా పడిపోయింది. ఫ్యాక్టరీలు, క్లోత్ మిల్లులు మూతబడ్డాయి. మరమగ్గాలు ఆడటం లేదు. సీజన్ మొదలయ్యేనాటికి ఆర్డర్లు డెలివరీ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఫ్యాషన్ డిజైనర్లు కొత్త డిజైన్లను తయారు చేయగలిగే పరిస్థితి కూడా లేదు.

ఇప్పటి వరకూ ఆర్డర్లు ప్లేస్ చేయని ఫ్యాషన్ డిజైనర్లు, క్లోతియర్లు కూడా చైనాలో ఆర్డర్లు ప్లేస్ చేయడానికి జంకుతున్నారు. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ పుణ్యమా అని వారు బట్టలు తెప్పించడానికి కూడా పదిసార్లు ఆలోచిస్తున్నారు. మామూలుగా చైనా నుంచి క్రేప్స్, జార్జెట్ లు, టుల్లె, షిఫాన్, నెట్ వంటి క్లాత్స్ ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటారు. ఒక హైదరాబాద్ నగరంలోనే 40 మంది ఫ్యాషన్ డిజైనర్లు, 25 కు పైగా బ్రాండ్ అవుట్ లెట్లు చైనా వస్త్రాలపై ఆధారపడిడిజైన్లను రూపొందిస్తూ ఉంటారు. వారంతా ఇప్పుడు కరోనా వైరస్ రాకున్నా వణుకుతున్నారు.

“గత పది పదిహేను రోజుల్లోనే కోట్లాది రూపాయల వ్యాపారాన్ని పోగొట్టుకున్నాం. చైనాలో నేను దాదాపు రెండు కోట్ల రూపాయల ఆర్డర్స్ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఆ కన్ సైన్ మెంట్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా నా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది” అని నగరంలోని ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ఒకరు తెలియచేశారు. “నా లాంటి పరిస్థితే మరో పది మంది డిజైనర్లకూ ఎదురవుతోంది. వారు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు” అని ఆయన అన్నారు. సూరత్ లో ఈ తరహా క్లాత్ దొరికినా దాని ధర చాలా ఎక్కువ. దానితో పోలిస్తే చైనా దుస్తుల ధర తక్కువ అన్నారాయన.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.