ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ
By రాణి Published on 13 April 2020 2:11 PM ISTముఖ్యాంశాలు
- అగ్రరాజ్యంలో కుదేలైన మీడియా సంస్థలు
- 28000 మంది ఉద్యోగాలు తొలగింపు
- మిగిలిన ఉద్యోగుల జీతాాల్లో భారీగా కోతలు
- భారత్ లోనూ ఇదే పరిస్థితి
అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా 28000 మంది ఉద్యోగాలు కోల్పోగా మరికొంతమందిని ఆయా మీడియా సంస్థలు లాంగ్ లీవ్ ఇచ్చేశాయి. పరిమిత సిబ్బంది వార్తా పత్రికలను నడిపిస్తున్న సంస్థలైతే జీతాల్లో కోతలు విధించాయి. ఒక్క మీడియా సంస్థలోనే కాదు అక్కడున్న సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సైతం ఇదే పరిస్థితి.
Also Read : ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం కుదేలవుతోంది. ప్రపంచ పెద్దన్న కరోనా కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం సుమారు 60 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు నిపుణులు. అమెరికా ప్రింట్ మీడియా అయితే కరోనా కొట్టిన చావుదెబ్బ నుంచి ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి మామూలు రోజులకన్నా కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి వార్తలు చదివే వారి సంఖ్య పెరిగింది. కానీ వార్తా పత్రికలను నడపాలంటే కావాల్సిన కనీస నిధులు ఆయా సంస్థలకు రాని కారణంగానే సంస్థలను నడపలేని పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా అన్ని రకాల వ్యాపార సంస్థలు మూతపడిన తరుణంలో ప్రింట్ మీడియాకు యాడ్స్ తగ్గాయి. ఫలితంగా వివిధ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు ఊడాయి. కొంతమందికి మూడు వారాల జీతం, మరికొంతమందికి వారంలో నాలుగు రోజులు మాత్రమే జీతాలిచ్చే పరిస్థితికొచ్చాయి వార్తా సంస్థలు.
కరోనాకు ముందే కష్టాల్లో ఉన్న అమెరికా ప్రింట్ మీడియా.. కరోనా వచ్చాక మరింత నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కరోనా ప్రభావంతో ఏర్పడిన సంక్షోభం 17 మిలియన్ల అమెరికన్ల ఉపాధిని మింగేసింది. వ్యాపార ప్రకటనలపైనే ఆధారపడి నడిచే కొన్ని మీడియా సంస్థలు మూతపడుతున్నాయి.
వెబ్ సైట్లలో వార్తలు చదివే వారి సంఖ్య పెరిగినప్పటికీ ప్రస్తుతమున్న అనూహ్య పరిస్థితుల్లో వాటిని నడపలేమని చాలా సంస్థలు చేతులెత్తేస్తున్నాయి.
భారీగా కోతలు..ఉద్యోగుల తొలగింపు
న్యూయార్క్ లో ఉన్న యామ్ న్యూయార్క్, మెట్రో న్యూయార్క్ పత్రికల పరిస్థితి మరీ దారుణమైపోయింది. ఆర్థిక సంక్షోభంతో 30 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాయి ఆయా యాజమాన్యాలు. న్యూస్ అప్ డైట్స్ తో పాటు లైఫ్ స్టైల్ గురించి చెప్పే బజ్ ఫీడ్ ఈ ఏడాది కొద్దిగా లాభాల దిశగా ఉన్నప్పటికీ ఊహించని విపత్తుతో కుదేలైంది. ఏప్రిల్, మే నెలల్లో ఈసంస్థలో ఉన్న ఉద్యోగుల జీతాల్లో 25 శాతం కోత విధించింది. కరోనా నుంచి కోలుకునేంతవరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని ముందే ఉద్యోగులకు చెప్పేసింది. ఉద్యోగం పోయే కన్నా..ఎంతోకొంత జీతమైతే వస్తుందనుకుని సర్దుకుని అక్కడే పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఇక జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో కూడా పత్రికల ప్రింటింగ్ ను పెంచాలనుకున్న బజ్ ఫీడ్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాల్లో ఆఫీసులను ఎత్తివేసే పరిస్థితి దాపురించింది.
వందేళ్ల చరిత్ర ఉన్న మీడియా సంస్థలు కూడా కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. 13 మంది ఉద్యోగులను తొలగించిన డెన్వర్ పోస్ట్ సంస్థ మిగిలిన ఉద్యోగులను 3 వారాలపాటు జీతాలు లేకుండా పనిచేయాలని కోరింది. సిన్స్ నాటీ, డెట్రాయిట్ వంటి నగరాల్లో వార పత్రికలను అందించే ఆక్లేడ్ మీడియా అయితే 80 శాతం మంది ఉద్యోగులకు సెలవులిచ్చేసింది. యూఎస్ఏ టుడే, ద డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ లతో పాటు 250 వార్తా పత్రికలను నడిపే గానెట్ సంస్థ రానున్న మూడు నెలల్లో నెలకు 5 రోజుల చొప్పున ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. జెస్బెల్, ద ఆనియన్ అండ్ డెడ్ స్పిన్ పత్రికలు 5 శాతం, గ్రూప్ 9 మీడియా 7 శాతం ఉద్యోగులను తొలగించాయి. స్కై మ్యాగ్జైన్, అలస్కా బియాండ్ పత్రికలైతే పూర్తిగా ప్రమాదంలో పడ్డాయనే చెప్పాలి. 70 వార్తా పత్రికలను నడిపే లీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కూడా ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోతలు విధించాలన్న ఆలోచనతోనే ఉంది. మరికొన్ని వార్తాసంస్థలైతే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకూ వేచి చూడాలని భావిస్తున్నాయి.
Also Read : అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు
మెక్ క్లాచీ సంస్థ పూర్తిగా దివాళా తీసింది. ది అవుట్ లైన్ వెబ్ మ్యాగ్జైన్ 24మంది ఉద్యోగులను, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ సంస్థ 31 మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీల్లో ఉన్న మిగిలిన ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధించాయి. కరోనా నుంచి బయటపడేంత వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాయి. అమెరికాలోనే కాదు.. భారత్ లో ఉన్న మీడియా సంస్థల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు ఆగిపోయాయి. వార్తా సంస్థలకు యాడ్స్ లేవు. మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించేశాయి. దేశానికి అన్నంపెట్టే రైతన్న కూడా కరోనా కారణంగా నష్టపోతున్నాడు. ఈ కష్టకాలం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో ఆ దైవానికి ఎరుక అనుకుని సరిపెట్టుకుంటున్నారు రైతులు. ఉద్యోగాలు లేక, జీతాలు రాక చాలా కుటుంబాలు మంచినీటితో కడుపు నింపుకుంటున్నాయి.