విజృంభిస్తోన్న కరోనా..

By రాణి  Published on  10 March 2020 6:08 AM GMT
విజృంభిస్తోన్న కరోనా..

ఇటలీలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా..4 వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. కాగా..ఇటలీలో మాత్రం వైరస్ విజృంభిస్తుండటంతో..అక్కడ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ నిర్భంధం అమలు చేయాలని రెండ్రోజుల క్రితం చెప్పగా..వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆ దేశం ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆదేశాల్ని కాదని ఎవరైనా బయటికి వస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇటలీ ప్రభుత్వం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మందికి పైగా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్యాలయాల్లో కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది. యువత కూడా పబ్ లు, పార్టీలకు, ఇతర వేడుకలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని వెల్లడించింది.

ఇటలీలో కొత్తగా 1807 మందికి వైరస్ నిర్థారణవ్వగా అక్కడ కరోనా బాధితుల సంఖ్య 9,712కు చేరింది. తాజాగా కరోనా సోకి 97 మంది మృతి చెందగా..మృతుల సంఖ్య 463కు చేరింది. అయితే ఈ మృతుల్లో చాలా మంది ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Also Read : కోవిడ్‌-19 అనుమానం.. చంపేసిన ఉత్తరకొరియా

చైనాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే క్రమంగా అదుపులోకి వస్తుంది. సోమవారం 17 మంది మృతి చెందడంతో..అక్కడ మృతుల సంఖ్య 3,136కు చేరింది. ఇక వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య 80,750కి చేరింది. ఇప్పటి వరకూ 59,000 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

ఇరాన్ లో కరోనా సోకి 43 మంది ప్రాణాలు కోల్పోగా..అక్కడ మృతుల సంఖ్య 237కి చేరింది. బాధితుల సంఖ్య 7,161 కు చేరగా..రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో సోమవారం 7 కరోనా కేసులు నిర్థారణవ్వగా మొత్తం 46 మంది దీని బారినపడినట్లయింది. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, జమ్మూ, పంజాబ్ లలో ఒక్కొక్కటి..మహారాష్ర్టలో రెండు కేసులు నమోదయ్యాయి.

Next Story