హైదరాబాద్‌లో కరోనా బాబా.. రోగాలు నయం చేస్తానంటూ..

By సుభాష్  Published on  25 July 2020 6:25 AM GMT
హైదరాబాద్‌లో కరోనా బాబా.. రోగాలు నయం చేస్తానంటూ..

హైదరాబాద్‌లో ఓ కరోనా బాబా వెలిశాడు. మంత్రాలు, మాయలు, శక్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి మోసాలకు పాల్పుడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40 నుంచి రూ.50వేలు వసూలు చేసినట్లు తేలింది. అయితే కరోనా బాబా లీలల గురించి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా బాబా స్థావరంపై దాడులు చేశారు పోలీసులు. ఈ ఘటన నగరంలోని హఫీజ్‌పేట హనీఫ్‌ కాలనీలో చోటు చేసుకుంది

లక్షలకొద్ది వసూలు

మంత్రాలతో కరోనా వైరస్‌ను నయం చేస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు ఈ కరోనా బాబా అలియాస్‌ బాబా ఇస్మాయిల్‌. మంత్రాలు, విబూది, నిమ్మకాలతో పూజలు చేసి కరోనాను పోగొడతానని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నాడు. గత మార్చి నెల నుంచి ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు బాధితుల నుంచి లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అలాగే తనకు ఎంతో బలమైన శక్తులున్నాయంటూ శిష్యులతో ప్రచారం చేయిస్తున్నాడు. మాస్క్‌ లు సైతం పెట్టుకోనక్కరలేదని చెబుతూ, తనకున్న అపూర్వ శక్తులతో కరోనా నుంచి కాపాడుతానని నమ్మబలికాడు. బాబా మాటలను నమ్మిన కొందరు అమాయక ప్రజలు బాబాను ఆశ్రయించారు. జలుబు, దగ్గు, సాధారణ జ్వరం ఉన్నా అది కరోనానే అంటూ అమాయకులను భయపెట్టి వారి నుంచి లక్షల కొద్ది వసూలు చేస్తూ వచ్చాడు. అయితే బాబా చేతిలో సుమారు 70 మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించిన పోలీసులు.. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లాలని, ఇలాంటి బాబాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటివి ఏమైనా జరిగిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఇక ఇలాంటి మోసాలకు పాల్పడిన బాబాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇస్మాయిల్‌ బాబా మియాపూర్‌లో తాయత్తులు కడుతుంటాడు. కరోనాను అదను చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడని అన్నారు. బాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Next Story