కరోనా దెబ్బకి కాలుష్యం నుంచి బయటపడుతున్నామా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 March 2020 6:12 AM GMT
కరోనా దెబ్బకి కాలుష్యం నుంచి బయటపడుతున్నామా..

కరోనా ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్‌... ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అయితే జనాల ప్రాణాలు బలి తీసుకుంటున్న కరోనా వల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది.

అదేంటంటే, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది. కాని కరోనా ఎఫెక్ట్ వల్ల రెండు నెలలపాటు ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వాహనాల రాకపోకలు కూడా ఆగిపోవడంతో కాలుష్య రహిత చైనాగా నిలిచింది. ఇక కరోనా పుట్టిల్లు చైనాలోని వుహాన్ నగరం ప్రజలు నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత గాలిలో నైట్రోజన్ డై ఆక్సైడ్ శాతం భారీగా పడిపోయినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

నిర్బంధంలో ఉన్న ఇటలీలోనూ, స్పెయిన్‌లోనూ నైట్రోజన్ డయాక్సైడ్ నిల్వలు తగ్గినట్టు గుర్తించారు. ఒక నిర్దిష్ట సంఘటన కారణంగా విస్తృత ప్రదేశంలో నైట్రోజన్ డయాక్సైడ్ శాతం ఇంత గణనీయంగా పడిపోవడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిర్బంధం విధించిన ఇతర దేశాలైన అర్జెంటీనా, బవేరియా, బెల్జియం, కాలిఫోర్నియా, ఫ్రాన్స్, ట్యునీషియాలో వాతావరణాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు. సాధారణంగా నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు ప్రధానంగా వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ పవర్ స్టేషన్లు నుంచి విడుదలవుతుంది. గత కొన్ని రోజులుగా ప్రపంచలోని మెజారిటీ పరిశ్రమలు మూతపడ్డాయి. కాబట్టీ కాలుష్యం తగ్గుముఖం పట్టింది.

ఇక పోతే భారత వాతావరణం విభాగం అంచానాలను బట్టి ఢిల్లీలో ప్రస్తుత గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకే పరిమితమయ్యాయి. కరోనాకు ముందు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 10 నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. దేశరాజధాని ఢిల్లీలో ప్రతి రోజు కాలుష్యం అంతకంతకు పెరిగిపోయేది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొనేవారు. చిన్న పిల్లలు, ముసలి వారు, గర్భిణులు కాలుష్యం బారిన పడి అనారోగ్యాంపాలయ్యేవారు. ఢిల్లీలో పెరిగిపోయిన వాహణాల పొగ వలన వాయు కాలుష్యం, అలాగే శబ్దకాలుష్యం కూడా పెరిగిపోయింది. కొద్దిరోజులు ఢిల్లీ వాసులు మాస్కులు వేసుకొని తిరిగారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పుణ్యమా అని వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని. కానీ కరోనా కట్టడి మొదలైన తరువాత ఇది ఏకంగా 129కి పడిపోయిందని వాతావరణ శాఖవారు తెలిపారు.

అంతెందుకు మీ ఊర్లోనే చూడండి. జనాలు రోడ్ల మీదికి రావడం తగ్గిపోయింది. పెద్ద వాహనాలు తిరగడమే లేదు. స్కూల్స్, కాలేజీలకు బస్సులు లేవు. ఇదే పరిస్థితి కొద్ది రోజులు కొనసాగితే కరోనా తగ్గుముఖం పట్టడమే కాదు.. కాలుష్యం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మన భూమాత కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.

Next Story