కరోనా వైరస్ ను జయించిన 113 సంవత్సరాల వృద్ధురాలు

By సుభాష్  Published on  13 May 2020 3:54 AM GMT
కరోనా వైరస్ ను జయించిన 113 సంవత్సరాల వృద్ధురాలు

మాడ్రిడ్, స్పెయిన్: 113 సంవత్సరాల మహిళ, స్పెయిన్ దేశంలోనే అత్యధిక వయసు గల మహిళ కరోనా వైరస్ ను జయించింది. రిటైర్మెంట్ హోమ్ లో ఆమె చుట్టుపక్కల ఉన్న చాలా మంది కరోనా వైరస్ కు చనిపోయినా ఆమె మాత్రం తన ప్రాణాలను నిలబెట్టుకుందని స్థానికులు తెలిపారు.

మారియా బ్రన్యాస్.. అమెరికాలో పుట్టిన మహిళ. ఏప్రిల్ నెలలో ఆమెకు కరోనా వైరస్ సోకింది. 'శాంటా మరియా డెల్ తురా కేర్ హోమ్' లో ఆమె గత 20 సంవత్సరాలుగా అక్కడే ఉంటోంది. ఏప్రిల్ నెలలో ఆమెకు కరోనా సోకగా.. అప్పటి నుండి ఆమె తన గదిలోనే ఐసొలేషన్ లో ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని.. దాదాపుగా కోలుకుందని అక్కడి ప్రతినిధులు తెలిపారు. ఆమెలో మొదట లక్షణాలు కనిపించాయని.. ఆ తర్వాత ఆమె ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.. ఆమె గత వారం టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని వచ్చింది.

ముగ్గురికి తల్లి అయిన మారియా, తన రూమ్ లో కొన్ని వారాలుగా ఉంటోంది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఆమె గదిలోకి ప్రొటెక్టివ్ గేర్ సహాయంతో వెళ్ళాడు. ఆమెను పరీక్షిస్తూ వచ్చాడని.. ఆ తర్వాత ఆమె కోలుకుందని అక్కడి టీవీ ఛానల్ తెలిపింది. ఓ వీడియోలో మారియా తన కోసం వచ్చిన వ్యక్తిపై పొగడ్తలు కురిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు అని ఆమెను అడుగగా ఆనందంగా 'ఆరోగ్యంగా బతకగలిగాను' అని ఒక్క మాటలో చెప్పుకొచ్చింది.

ఆమె ఉంటున్న కేర్ హోమ్ లో చాలా మంది చనిపోయారని.. కానీ ఆమె మాత్రం బ్రతికిందని స్థానికులు తెలిపారు. మారియా కుమార్తె రోసా మాట్లాడుతూ 'మా అమ్మ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది.. మాట్లాడుతోంది.. వివరిస్తోంది.. తను మునుపటిలా మారిపోయింది' అని చెప్పుకొచ్చింది. స్పానిష్ మీడియాలో మారియా గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. స్పెయిన్ లో ఉన్న అత్యధిక వయసు గల మహిళ అంటూ అక్కడి మీడియా రాసుకుని వచ్చింది.

మారియా మార్చి 4, 1907న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించింది. స్పెయిన్ కు చెందిన ఆమె తండ్రి శాన్ ఫ్రాన్సిస్కో లో జర్నలిస్ట్ గా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె ఒక పడవలో అమెరికా నుండి స్పెయిన్ కు చేరుకుంది. స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన 1918-19న కూడా ఆమె ప్రాణాలను కాపాడుకుంది. స్పెయిన్ సివిల్ వార్(1936-39) సమయంలో కూడా ఆమెకు ఎటువంటి హానీ కలుగలేదు. కరోనా మహమ్మారి కారణంగా స్పెయిన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. 27000కి పైగా కరోనా కారణంగా చనిపోయారని అక్కడి హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

Next Story