కరోనా @ 100

By రాణి  Published on  11 April 2020 8:20 AM GMT
కరోనా @ 100

ముఖ్యాంశాలు

  • ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం
  • అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా
  • ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మరణాలు
  • అత్యధిక మరణాలు ఇటలీలో..వరుసలో అమెరికా, స్పెయిన్

ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించడం మొదలై ఏప్రిల్ 9వ తేదీకి సరిగ్గా 100 రోజులు పూర్తయింది. డిసెంబర్ 31వ తేదీన నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా సిద్ధమవుతున్న వేళ చైనాలోని వుహాన్ లో గల సీ ఫుడ్ మార్కెట్ నుంచి న్యూమోనియా వంటి వ్యాధి వ్యాపిస్తుందని..వెంటనే మార్కెట్ ను మూసివేయాలని చైనా ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీన మార్కెట్ ను మూసివేశారు. ఆ తర్వాత నుంచి రోజురోజుకూ పెరుగుతున్న వైరస్ కేసులతో దానిని ఎలా అధిగమించాలో చైనాకు పాలుపోలేదు. మాస్క్ లు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు అయిపోయాయి. దీంతో ఇతర దేశాలను తమ దేశానికి వైద్య సహాయం అందించాలని అర్థించింది చైనా.

రోజూ వేల కొద్దీ కరోనా కేసులు..వందల్లో మరణాలు. ఆఖరికి వైరస్ కారణంగా మరణించినవారికి దహన సంస్కారాలు చేసే అవకాశం కూడా పోయింది. ముఖ్యంగా వుహాన్, హుబెయ్ ప్రావిన్సులలో కరోనా వైరస్ తన రాక్షసి రూపాన్ని ప్రదర్శించింది. మృత్యు మృదంగం మోగించింది.

Also Read : ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజు

  • జనవరి 9వ తేదీన..9వ రోజు వుహాన్ లో తొలి కరోనా మరణం నమోదైంది. 61 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ తో మృతి చెందాడు. దీంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై కరోనా అధిక ప్రభావం చూపుతుందని గ్రహించి..వుహాన్ ను షట్ డౌన్ చేశారు. అష్టదిగ్భంధం చేశారు. పురుగు కూడా వెళ్లేందుకు లేకుండా కట్టడి చేశారు. నగరం మొత్తాన్ని శానిటైజ్ చేసి ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.
  • 13వ రోజు అంటే జనవరి 13న థాయ్ లో కరోనా అడుగు పెట్టింది. వుహాన్ నుంచి బ్యాంకాక్ వెళ్లిన 61 ఏళ్ల వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించగా..అతడు ఆస్పత్రిలో చేరాడు. రక్తపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి థాయ్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది.
  • జనవరి 20 నుంచి వైరస్ ఐరోపా దేశాలకు వ్యాపించడం మొదలైంది. జపాన్, సౌత్ కొరియా, అమెరికా దేశాల్లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో వాషింగ్టన్ కు వుహాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్థారణయింది.
  • 24వ రోజు జనవరి 24న యూరప్ లో తొలి కరోనా కేసు నమోదైంది. చైనీయుల కొత్త సంవత్సర వేడుకలను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు వేల మంది వుహాన్ కు వచ్చారు. తిరిగి అక్కడి నుంచి ఫ్రాన్స్ కు వెళ్లిన ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్థారణయింది.
  • అదేవిధంగా జనవరి 31వ తేదీన బ్రిటన్ లో మొదటి కేసును గుర్తించారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన రోజే అక్కడ తొలి కరోనా కేసు నమోదవ్వడం గమనార్హం.
  • 36వ రోజూ ఫిబ్రవరి నాల్గవ తేదీన చైనా వెలుపల తొలి కరోనా మరణం సంభవించింది. మనీలా ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వుహాన్ నివాసి మృతి చెందాడు. కరోనా గురించి ముందు హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ మృతితో చైనా మొత్తంగా లాక్ డౌన్ విధించారు. కానీ ఆ డాక్టర్ మృతిపై ఇప్పటికీ ఇంకా అనుమానాలున్నాయి. అది చైనా తయారు చేసిన వైరస్ అని..దానిని కప్పిపుచ్చుకునేందుకే డాక్టర్ కు వివిధ రకాల ఇంజెక్షన్లిచ్చి మరీ చంపించిందన్న నింద చైనా ప్రభుత్వం పై పడింది.
  • ఫిబ్రవరి 19..కరోనా వైరస్ వ్యాపించడం మొదలై 50 రోజులు. ఆ రోజు రెండు దేశాల్లో కరోనా అలజడి మొదలైంది. దక్షిణ కొరియాలో వైరస్ లక్షణాలున్న ఓ మహిళ చర్చికి, హోటల్ కు వెళ్లడంతో తొలి కేసు నమోదైనట్లు ఆదేశ మంత్రి ప్రకటించారు. ఇరాన్ లో రెండు కరోనా కేసులు నమోదైన సమయంలోమిలాన్ జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ కు వేలాది మంది హాజరయ్యారు. వీరిలో స్పెయిన్ దేశీయులు ఎక్కువగా ఉన్నారు. కేవలం ఆ మ్యాచ్ వల్లే స్పెయిన్ , ఇటలీ దేశాల్లో వైరస్ విస్తరించింది.

Also Read : హానికరమైన వైరస్ నుంచి కాపాడే కరివేపాకు..ఇంకా ఎన్నో ఉపయోగాలు

  • 66వ రోజు మార్చి 6వ తేదీ నాటికి ఇటలీలో పరిస్థితి చేయి దాటిపోయింది. కేవలం ఆరంటే ఆరే రోజుల్లో మృతుల సంఖ్య ఆరు రెట్లు పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశంలో వృద్ధులు ఎక్కువగా ఉండటం. అందమైన దేశంలో ఉండే జనాభా 6 కోట్లు. లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో మరణాలతో ఇటలీ ప్రభుత్వానికి కూడా కరోనా రక్కసి ముచ్చెమటలు పట్టించింది.
  • మార్చి 11వ తేదీ 71వ రోజు కరోనా మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించింది.
  • మార్చి 17వ తేదీ..77వ రోజున కరోనా కారణంగా ఖండాలు, దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎక్కడికక్కడ విమాన రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి కోసం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ అప్పటికే వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. కానీ అది సమూహ వ్యాప్తి జరగకుండా మార్చి 23వ తేదీ నుంచి ప్రధాని మోడీ దేశమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
  • భారత్ ను ఆదర్శంగా తీసుకున్న మరిన్ని దేశాలు కూడా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ లాక్ డౌన్ చేస్తున్నట్లు వెల్లడించాయి. మార్చి 23 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,70,000 దాటింది. ఇదే సమయానికి చైనాలో మాత్రం వైరస్ వ్యాప్తి అదుపులోకొచ్చింది. చైనా ఏం చేసిందో ఏమో తెలీదు గానీ స్థానికంగా ఒక్కకేసు నమోదవ్వలేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రం వైరస్ ను గుర్తించింది చైనా. వైరస్ వ్యాప్తికి కారణమైన వుహాన్ లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు.
  • ఏప్రిల్ 2వ తేదీన కరోనా మహమ్మారి మరింత విజృంభించింది. ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 10 లక్షలు దాటగా..50 వేలకు పైగా మరణించారు. ఏప్రిల్ 8వ తేదీకి ఈ సంఖ్య 14 లక్షలకు పెరిగింది. కేవలం వారం రోజుల వ్యవధిలో వైరస్ ఊహించని రీతిలో ప్రబలింది. ఇందుకు కారణం ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలు.
  • మార్చి 11 నుంచి 13వరకూ నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన ప్రార్థనలకు 30 దేశాల నుంచి 300 మంది మత పెద్దలు వీసా నిబంధనలు ఉల్లంఘించి మరీ భారత్ లోకి ప్రవేశించారు. వారి ద్వారానే మనదేశంలో వైరస్ మరింత విస్తరించింది.
  • ఏప్రిల్ 11వ తేదీకి ప్రపంచ వ్యాప్తంగా 16,99,019 కరోనా కేసులు నమోదవ్వగా..మృతుల సంఖ్య 1,02,774కు చేరింది. మరో 3,76,976 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదవ్వగా, ఇటలీలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో 5,04,780 కరోనా కేసులుండగా..మృతులు 18,763 మంది. ఇటలీలో 1,47,577 కేసులు నమోదవ్వగా 18,849 మంది మృతి చెందారు.
  • మొత్తానికి కరోనా రక్కసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతికి కోపమొస్తే..దాని ఏదొక రూపం కనిపించేలా విజృంభిస్తుంది. కానీ ఈ కరోనాకు రూపం లేదు. కంటికి కనిపించదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచ దేశాలకు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలను మిగిల్చింది.

Next Story