ఆ జీవో తెలంగాణ‌ను ఎడారిలా మారుస్తుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2020 1:29 PM GMT
ఆ జీవో తెలంగాణ‌ను ఎడారిలా మారుస్తుంది

పోతిరెడ్డి పాడుపై కుట్ర‌పూరితంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు యత్నం జ‌రుగుతోంద‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇక్క‌డి నీళ్లు, నిధులు కాపాడాల‌నే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింద‌న్నారు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి. తెలంగాణ హ‌క్కుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త కేసీఆర్ మీద లేదా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ వ్య‌వ‌సాయానికి జ‌గ‌న్‌, కేసీఆర్ దోస్తాన గొడ్డ‌పలిపెట్టుగా మారిందన్నారు. జ‌గ‌న్ అసెంబ్లీలో పోతిరెడ్డి పాడు పై ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కూడా కూడా కేసీఆర్ స్పందించ‌లేద‌న్నారు. కాళేశ్వ‌రం నుంచి 2 టీఎంసీల ఎత్తిపోత‌కు రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. భావి త‌రాల జీవితాలు తాక‌ట్టు పెట్టి ప‌థ‌కం చేప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామ‌ని, ఇదే విష‌య‌మై కేంద్ర మంత్రి షెకావ‌త్‌తో కూడా మాట్లాడిన‌ట్లు చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నాడు పోతిరెడ్డిపాడుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. చెప్పిన పంట‌లు వేస్తేనే రైతు బందు ఇస్తామ‌ని కేసీఆర్ ఎప్పుడూ చెప్ప‌లేద‌ని, దీనిని రైతులు వ్య‌తిరేకిస్తార‌న్నారు. రైతులు త‌మ భూముల్లో వాళ్ల‌కు న‌చ్చిన పంట‌లు వేసుకునే హ‌క్కు ఉంద‌న్నారు. జూన్ రెండున ఎస్ ఎల్బీసీ టెన్నెల్ ద‌గ్గ‌ర కాంగ్రెస్ నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

Untitled 1

పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం పెంపున‌కు 2005లోనే ఆదేశాలు వ‌చ్చాయ‌ని, ప్రాజెక్టు సామ‌ర్థ్యం 11 నుంచి 44 వేల క్యూసెక్కుల‌కు పెంచేందుకు జీవో ఇచ్చార‌ని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారని, ఆనాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడ‌లేద‌న్నారు. తెలంగాణ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతోంద‌ని కేసీఆర్ రాజీనామా చేశారని, రాజీనామా చేసిన అనంత‌రం కేసీఆర్ పోతిరెడ్డిపాడుపై ప్ర‌స్తావ‌న కూడా తేలేద‌న్నారు. వైఎస్ఆర్‌ హ‌యాంలో పోరాడిన‌ట్లు కేసీఆర్ గొప్ప‌లు చెబుతున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌తో సీఎం జ‌గ‌న్ భేటీ అయిన త‌ర్వాతే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ఏపీ జీవోను విడుద‌ల చేసిందని ఆరోపించారు. ఈ భేటీకి సంబంధించి వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్టాలన్నారు. దీనిపై క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Untitled 1

దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను ఎడారిగా మార్చే 203 జీవోను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. జీవోకు కారణం.. తెలంగాణ ద్రోహి కేసీఆరేనని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో 90 శాతం పనులు పూర్తి చేసిన కేసీఆర్.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. దీనిపై అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్.. నిన్ను బొంద పెట్టినా పాపం లేదని ఆక్రోశ‌ వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ కూర్చొనే పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు జీవో ఇచ్చారని ఆరోపించారు. శాసనమండలి చైర్మన్ ఒక రాజకీయ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తన పక్కన బ్రోకర్లను పెట్టుకుని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్, ప్రతిపక్షం ఉందో లేదో నీ బిడ్డను అడుగు అని నిలదీశారు. ఏపీ జీవో పై ప్రధానిని కలుస్తాం, పార్లమెంట్‌లో పోరాడుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

Next Story