నిన్నటి దాకా వద్దు... ఇప్పుడదే అందరికీ ముద్దు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 6:41 AM GMT
నిన్నటి దాకా వద్దు... ఇప్పుడదే అందరికీ ముద్దు..!

ఒకప్పుడు అది భుజం మీద భారం. వద్దు వద్దంటే పెట్టి మోయమనేవారు. కానీ ఇప్పుడది భుజకీర్తి. ఆ పదవి అందరికీ కావాలి. అదే తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో బిజెపి నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకోవడం,మరో రెండో చోట్ల మంచి ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలబడటంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షపదవి కోసం పోటీ భారీగానే ఉంది.

ఇప్పటి వరకూ ఒక టర్ము చాలనుకున్న రాష్ట్ర అధ్యక్షులు డా. కె లక్ష్మణ్ ఇప్పుడు రెండో టర్ము కావాలనుకుంటున్నారు. దానికోసం పావులు కదుపుతున్నారు. ఇటీవల మీడియా పిచ్చాపాటీలో ఆయన తన మనోగతాన్ని బయటపెట్టారు. పార్టీ నాకు ఏ బాధ్యతను ఇచ్చినా చేపట్టి, సమర్థవంతంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ నగర మాజీ అధ్యక్షులు చింతల రామచంద్రా రెడ్డి లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఢిల్లీలో గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. అంతే కాదు. అధ్యక్ష పదవికి పోటీపడే వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జాతీయ కార్యదర్శి మురళీధర రావు తాను పోటీలో లేనని ప్రకటించినా, ఆయన పేరు కూడా అధ్యక్ష పదవి ఆశావహుల జాబితాలో చక్కర్లు కొడుతోంది. మురళీధరరావుకు గతంలో 2014,2016 లో అవకాశం వచ్చినా ఆయన అధ్యక్షపదవిని తిరస్కరించారు. పార్టీ ప్రదర్శన మెరుగుపడటం, పలు కీలక నేతలు పార్టీలో చేరడం, వివిధ పార్టీలు బిజెపిని సీరియస్ పోటీదారుగా పరిగణించడం, అన్నిటికీ మించి బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీ ఎదుగుదల విషయంలో బాగా దృష్టి పెట్టడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది.

పార్టీ రాష్ట్ర అధినేత హైదరాబాద్ బయటివాడు కావాలన్న వాదన కూడా క్రమేపీ బలపడుతోంది. అందుకే బండి సంజయ్ వంటి వారి పేరు కూడా బాగానే వినపడుతోంది. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిన గద్వాల్ జేజమ్మ డి కె అరుణ కూడా అధ్యక్షపదవిని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే నిన్న మొన్న పార్టీలో చేరిన ఆమెకు పగ్గాలివ్వడమేమిటని చాలా మంది వాదిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కూడా నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చినవారే.

మొత్తం మీద రాష్ట్ర బిజెపి బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కీలక నేతలందరూ ప్రయత్నిస్తున్నారు. గజమాల ఎవరి మెడలో పడుతుందో వేచి చూడాలి మరి.

Next Story