నింగిలోకి జీశాట్‌-30 శాటిలైట్‌.. ప్రయోగ కేంద్రం శ్రీహరికోట కాదంట..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 8:56 AM GMT
నింగిలోకి జీశాట్‌-30 శాటిలైట్‌.. ప్రయోగ కేంద్రం శ్రీహరికోట కాదంట..!

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న ప్రయోగం జరగనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేసిన జీశాట్‌-30 శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. అయితే ఈ ప్రయోగం మన భారత్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జరగడం లేదు. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 17వ తేదీన ప్రయోగించనున్నారు. ఏరియేన్‌-5 రాకెట్‌ ద్వారా శాటలైట్‌ అంతరిక్షంలోని పంపించబడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు.

సుమారు 3,357 కిలోల బరువున్న జీశాట్‌ను కమ్యూనికేషన్‌ శాటిలైట్‌గా తయారుచేశారు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో తయారు చేసిన జీశాట్‌ను జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి చేర్చనున్నారు. ఇన్‌శాట్‌-4కు ప్రత్యామ్నాయంగా ఇస్రో శాస్త్రవేత్తలు జీశాట్‌-30ని తయారు చేశారు. ఈ శాటిలైట్ సీ, కేయూ బ్యాండ్లో సేవలను అందించనున్నది. భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు కేయూ బ్యాండ్‌లో, ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు సీ బ్యాండ్‌ ద్వారా సేవలు అందించనుంది. గల్ఫ్‌ దేశాలు కూడా సీ బ్యాండ్‌ ద్వారా సేవలను జీశాట్‌ సేవలను వినియోగించుకోనుంది.



మరోవైపు వచ్చే సంవత్సరం చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ చేసిన ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా ముగ్గురు భారత వ్యోమగాములను కనీసం వారంపాటు అంతరిక్షంలోకి పంపబోతున్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మొదటగా రెండు మానవ రహిత మిషన్లను అంతరిక్షంలోకి పంపించనుంది. మొదటిది డిసెంబర్‌ 2020, రెండవ ప్రయోగం జులై 2021లో చేపట్టనున్నారు. చివరగా డిసెంబర్‌ 2021లో మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రయోగం చేపట్టనున్నారు.

Next Story