నవంబర్ 2 నుంచి కళాశాలలు ప్రారంభం
By సుభాష్ Published on 31 Oct 2020 7:42 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో విద్యాసంస్థలతో పాటు అన్ని రంగాలపై దెబ్బకొట్టింది కరోనా. ఇక విద్యార్థులు సైతం చదువును నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైనా.. దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని తల్లిదండ్రులు చెబుతున్న మాట. అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడో వంతు విద్యార్థులనే అనుమతిస్తామని, ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయని అన్నారు. రెండు సెమిస్టర్లుగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించామని, మార్చి నెలకు మొదటి సెమిస్టర్, ఆగస్టు నాటికి రెండో సెమిస్టర్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అకడమిక్ క్యాలెండర్ని 180 రోజులు రూపొందించామని, ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11లోపు పూర్తి చేస్తామని, డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లను నవంబర్ నెలాఖరుకు నిర్వహిస్తామని అన్నారు. కళాశాలకు వచ్చే ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని, కళాశాలకు వచ్చే విద్యార్థులు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన అన్నారు.