ఏపీలో 'వైఎస్ఆర్ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 3:57 PM IST
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ..కొన్ని విషయాల్లో కేసీఆర్‌ బాటలో నడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 'కంటి వెలుగు' పథకాన్ని..ఏపీలో కూడా ప్రారంభించారు వైఎస్ జగన్. దీనికి 'వైఎస్‌ఆర్ కంటి వెలుగు'అని పేరు పెట్టారు. ఈ పథకం కింద తొలి దశలో 70లక్షల మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్, డిసెంబర్‌లో మొత్తంపరీక్షలు నిర్వహిస్తారు. కంటి పరీక్ష దగ్గర నుంచి కళ్ల జోళ్ల వరకు అన్ని ఉచితంగా అందిస్తారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో అందరికీ కంటి వెలుగు పథకం అందుబాటులోకి వస్తుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

రాష్ట్రంలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కంటి సమస్యలు పట్టించుకోవాలన్నారు.లేకపోతే చూపు పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేకుండా..చికిత్స చేయిస్తామన్నారు సీఎం జగన్. రూ.560 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి అక్డోబర్ 16 వరకు తొలి దశ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో 62,489 పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు.

Next Story