ఏపీలో భారీ వర్షాలకు 10 మంది మృతి.. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా..!

By సుభాష్  Published on  14 Oct 2020 1:15 PM GMT
ఏపీలో భారీ వర్షాలకు 10 మంది మృతి.. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా..!

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవతం అతాలకుతలం అవుతోంది. ఇటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలువురు మృత్యువాత పడుతున్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలుగగా, మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఇక శిథిలావస్థలో ఉన్న ఇళ్లు సైతం కూలిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటి కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.46 క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు అధికారులు. కృష్ణా నదికి కుడి, ఎడమ ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలు నీటి మునిగే అవకాశం ఉందని అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా తలెత్తే ఇబ్బందులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది.

Next Story
Share it