వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
By Newsmeter.Network
మేడారం సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. తెలంగాణలోని అతి పెద్ద జాతర అయినటువంటి మేడారానికి భక్తజనం పోటెత్తుతున్నారు. వనంవీడి జనంలోకి వచ్చిన అమ్మవార్లను దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలిలివస్తున్నారు. అశేష భక్తజనం రాకతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి.